రాష్ట్రాల హద్దులు చెరిగిపోతున్నాయి. భాషా భేదం అంతకంతకూ తగ్గిపోతోంది. అన్ని భాషల వాళ్లూ అన్ని సినిమాలూ చూసేస్తున్నారు. ప్రాంతీయ సినిమా రోజు రోజుకూ పెద్దదవుతోంది. హీరోల మార్కెట్ పరిధి విస్తరిస్తోంది. ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకుంటూ బహు భాషా చిత్రాలు చేయడమే కాక.. ఆయా భాషల్లో సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు హీరోలు.
ఆర్ఆర్ఆర్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మలయాళంలో తప్ప మిగతా ప్రధాన భాషలన్నింట్లో సొంత వాయిస్‌తో స్పష్టంగా డైలాగ్స్ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. తమిళ స్టార్లలో కమల్ హాసన్, సూర్య, కార్తి లాంటి వాళ్లు ఇప్పటికే తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం తెలిసిందే. ఐతే మిగతా హీరోలకు అది చాలా కష్టమైన విషయంగా అనిపించి ఆ ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు ధనుష్ ఈ జాబితాలో చేరుతున్నాడు.
ఇప్పటికే డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ధనుష్.. ఇప్పుడు నేరుగా సార్ సినిమాతో తెలుగులోకి అడుగు పెడుతున్నాడు. ఈ చిత్రం తమిళం, తెలుగులో ఒకే సారి తెరకెక్కుతోంది. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఇక్కడి బేనర్ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
గురువారం ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా సార్ టీజర్ లాంచ్ చేశారు. అందులో ధనుష్ తెలుగు డైలాగులను స్పష్టంగా పలికి ఆశ్చర్యపరిచాడు. కొంత తమిళ టచ్ ఉన్నప్పటికీ.. సాధ్యమైనంత మెరుగ్గానే డైలాగులు పలికాడు. ఇప్పటిదాకా ధనుష్‌కు తెలుగులో అతడికి సెట్టయ్యే వాయిస్ ఉన్న ఆర్టిస్టుతోనే డబ్బింగ్ చెప్పించేవారు. సార్ కోసం అలాగే ట్రై చేసి ఉండొచ్చు కానీ.. ఇది పక్కా తెలుగు సినిమా, తమిళ అనువాద చిత్రం కాదు అనే ఫీల్ రావడానికి ధనుష్ కష్టపడి డబ్బింగ్ చెప్పినట్లున్నాడు. ఈ ప్రయత్నానికి మంచి మార్కులే పడుతున్నాయి.