రామారావు స్పీడ్ పెంచాలి

ఇంకో నలభై ఎనిమిది గంటల లోపే రామారావు ఆన్ డ్యూటీ మొదటి షో పడనుంది. క్రాక్ బ్లాక్ బస్టర్, ఖిలాడీ డిజాస్టర్ తర్వాత మాస్ మహారాజా సినిమా కావడంతో అభిమానులు గట్టి అంచనాలే పెట్టుకున్నారు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించినంత వేగంగా లేకపోవడం విచిత్రం. హైదరాబాద్ తో సహా ప్రధాన నగరాలు, బిసి సెంటర్లు ఎక్కడా ఇంకా ఏ షో హౌస్ ఫుల్ కాలేదు. కమర్షియల్ బొమ్మ కాబట్టి నేరుగా కౌంటర్ అమ్మకాలు ఎక్కువ ఉంటాయనుకున్నా రవితేజ ఇమేజ్ కి కనీసం సగం సీట్లను ఈపాటికి అమ్మేసి ఉండాలి.

కానీ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. మాములుగా ప్రసాద్ ఐమ్యాక్స్ బిగ్ స్క్రీన్లో వెనుక వరస టికెట్లు హాట్ కేక్స్ లాంటివి. అవే ఇంకా అందుబాటులో ఉన్నాయి. ఇక మల్టీప్లెక్సుల సంగతి సరేసరి. 195 రూపాయల టికెట్ రేట్ ప్రభావమో లేక టాక్ వచ్చాక చూద్దాంలే అన్నట్టుగా మారిపోయిన ప్రేక్షకుల మనోగతమో అంతు చిక్కడం లేదు. ట్విట్టర్ ను నమ్మకండి సోషల్ మీడియాకి దూరంగా ఉండండని దర్శకుడు శరత్ మండవ చేసిన హితబోధను ఎవరూ పట్టించుకోవడం లేదు. అదే ఇప్పుడు మీమ్ మెటీరియల్ అయిపోయింది.

రామారావు స్లోగా కనిపించడానికి కారణాలు ఉన్నాయి. దీనికి రవితేజ తప్ప గొప్పగా చెప్పుకునే ఆకర్షణ లేదు. డైరెక్టర్ కొత్తవాడు. హీరోయిన్లు ఫామ్ లో ఉన్న బ్యాచ్ కాదు. సామ్ సిఎస్ సంగీతం ఛార్ట్ బస్టర్ కాలేకపోయింది. ఒకటి రెండు పాటలు మాస్ కు ఎక్కాయి. ట్రైలర్ సైతం ఎగ్జైటింగ్ గా అనిపించలేదు. సో ఎల్లుండి మొదటి ప్రీమియర్ అయ్యాక క్రాక్ రేంజ్ లోనో పవర్ టైపులోనో టాక్ బయటికి వస్తే ఆటోమేటిక్ గా కలెక్షన్లు పెరుగుతాయి. దీనికే ఇలా ఉంటే ఇక విక్రాంత్ రోనా, ది లెజెండ్ ల గురించి చెప్పేదేముంది.