బోయపాటి మీదే భారం.. కానీ

‘అఖండ’ లాంటి బ్లాక్‌బస్టర్‌తో కెరీర్ పీక్స్‌ను అందుకున్నాడు బోయపాటి శ్రీను. ఆ చిత్రం సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఏడాది కాలంలో దీనికంటే ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రాలు ఉండొచ్చు కానీ.. దాని స్థాయిలో అది అసాధారణంగా ఆడిందన్నది వాస్తవం. ఆ సినిమాకు ఆరంభంలో వచ్చిన టాక్‌కు.. దాని థియేట్రికల్ రన్‌కు సంబంధమే లేదు. నెల రోజుల తర్వాత కూడా హౌస్‌ఫుల్స్‌తో నడవడం అంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు.

ఇంత ఘనవిజయాన్ని అందుకున్న దర్శకుడితో తర్వాతి సినిమా చేయబోతుండటం రామ్ అదృష్టం అనే చెప్పాలి. ‘ఇస్మార్ట్ శంకర్’తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టి, ‘రెడ్’ డీసెంట్ సక్సెస్ చూసిన రామ్‌తో సినిమా చేయడానికి బోయపాటికి ఆ టైంలో అభ్యంతరం ఏమీ లేకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ‘ది వారియర్’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఎదుర్కొని డౌన్ అయిపోయాడు రామ్. దీంతో అతడికి హిట్ ఇవ్వాల్సిన భారం బోయపాటి మీదే పడింది. 

ఈ నేపథ్యంలో బోయపాటి స్క్రిప్టు మీద మరింత కసరత్తు చేస్తున్నాడని, ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లడానికి సమయం పడుతుందని అంటున్నారు. ఐతే ‘అఖండ’ తర్వాత బోయపాటితో సినిమా చేస్తున్న సినిమా కావడంతో రామ్‌ భరోసాతోనే ఉండొచ్చు కానీ.. బోయపాటి ట్రాక్ రికార్డు చూస్తే మాత్రం కంగారు తప్పదు. ఆయనకు బాలయ్యతో సింక్ అయినట్లు ఇంకెవరితోనూ సింక్ అవదు. బోయపాటి మార్కు లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లు, మైండ్ లెస్ మాస్ సీన్లు బాలయ్యకు సెట్ అయినట్లు ఇంకెవరికీ సెట్ కావు. తొలి చిత్రం ‘భద్ర’ను పక్కన పెడితే.. ఆ తర్వాత బాలయ్యతో కాకుండా వేరే హీరోలతో చేసిన సినిమాలేవీ సరిగా ఆడలేదు.

తులసి, దమ్ము, జయ జానకి నాయక, వినయ విధేయ రామ.. చిత్రాలు అందుకు నిదర్శనం. బాలయ్యతో చేసినట్లు మిగతా హీరోలతో చేసిన ఓవర్ ద టాప్ మాస్, యాక్షన్ సీన్లు కామెడీగా తయారవడం తెలిసిందే. రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్‌కే బోయపాటి సీన్లు సెట్ కాలేదు. అలాంటిది రామ్‌తో అతను లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్‌ చేయిస్తే.. ఇలాంటి మైండ్ లెస్ సీన్లు పెడితే ఔట్ పుట్ ఎలా ఉంటుందో, జనాలు ఎలా స్పందిస్తారో అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరి ఈ చిత్రం అంతిమంగా ప్రేక్షకులు ఎలాంటి అనుభూతినిస్తుందో చూడాలి.