కమల్ హాసన్ కెరీర్ దాదాపు ముగిసిపోయిందనే అభిప్రాయంతో ఉన్నారు జనాలంతా ‘విక్రమ్’ సినిమా మొదలవడానికి ముందు. మన్మథ లీల, చీకటి రాజ్యం, ఉత్తమ విలన్, విశ్వరూపం-2.. ఇలా ఆయన సినిమాలన్నీ డిజాస్టర్లవడం.. దీనికి తోడు ‘ఇండియన్-2’ మధ్యలో ఆగిపోవడం, కమల్ రాజకీయాల మీద దృష్టిసారించడంతో ఆయన ఫిలిం కెరీర్ మీద ఆశలు వదులుకున్నారు ఫ్యాన్స్. కానీ లోకేష్ కనకరాజ్ లాంటి హాట్ షాట్ డైరెక్టర్‌తో.. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్‌ల కలయికలో ‘విక్రమ్’ సినిమా మొదలుపెట్టడంతో వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి.
ఈ సినిమా అనూహ్య విజయం సాధించి కమల్ పేరు మార్మోగేలా చేసింది. ఆయన కెరీర్‌కు మళ్లీ మంచి ఊపునిచ్చింది. ఈ ఉత్సాహంలో త్వరలోనే ‘ఇండియన్-2’ను మొదలుపెట్టాలని చూస్తున్నాడు కమల్. దీని తర్వాత ‘శభాష్ నాయుడు’ను తిరిగి పట్టాలెక్కిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.
‘శభాష్ నాయుడు’ గురించి క్లారిటీ లేదు కానీ.. కమల్ ఒక ఎగ్జైటింగ్ డైరెక్టర్‌తో జత కట్టబోతున్న విషయం మాత్రం నిర్ధారణ అయింది. అతనెవరో కాదు.. మహేష్ నారాయణన్. మలయాళంలో మంచి పేరున్న దర్శకుల్లో అతనొకడు. మహేష్ బేసిగ్గా ఎడిటర్. కమల్ సినిమా ‘విశ్వరూపం’తో పాటు పెద్ద పెద్ద చిత్రాలు చాలా వాటికి ఎడిటర్‌గా పని చేసి ప్రశంలసందుకున్నాడు. అతను కొన్నేళ్ల కిందట ‘టేకాఫ్’ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా ప్రేక్షకాదరణతో పాటు అవార్డులూ గెలుచుకుంది. కరోనా టైంలో ఓటీటీలో విడుదలై గొప్ప ఆదరణ దక్కించుకున్న ఫాహద్ ఫాజిల్ సినిమాలు సీయూ సూన్, మాలిక్‌లకు దర్శకుడు మహేషే.
‘విశ్వరూపం’కు పని చేసినప్పటి నుంచి కమల్‌తో అతడికి మంచి అనుబంధం ఉంది. తాను దర్శకుడు కావడానికి కూడా కమలే కారణం అంటూ.. ఆయనతో తాను సినిమా చేయబోతున్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు మహేష్. ‘ఇండియన్-2’ పూర్తయ్యాక కమల్ తనతో సినిమా చేస్తాడని అతను ధ్రువీకరించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates