చూస్తుంటే హాలీవుడ్ లో వచ్చే స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ తరహాలో సౌత్ సినిమాలో కూడా సీక్వెల్స్ ప్రవాహం కొనసాగేలా ఉంది. కెజిఎఫ్ 2 బ్లాక్ బస్టర్ అయ్యాక మూడో భాగం గురించి ఇప్పటికే దర్శక నిర్మాతల మీద ఒత్తిడి మొదలయ్యింది. సెకండ్ పార్ట్ లోనే రాఖీ భాయ్ పాత్రకు ఇన్ డైరెక్ట్ గా ముగింపు ఇచ్చినా అవసరం పడొచ్చనే తరహాలో క్లూస్ ఇచ్చి వదిలారు. సో వచ్చే ఛాన్స్ ని కొట్టిపారేయలేం. అంతే స్థాయిలో ఇప్పుడు డిస్కషన్ లో ఉన్న మరో ప్యాన్ ఇండియా మూవీ పుష్ప. ముఖ్యంగా నార్త్ సర్కిల్స్ లో దీని డిమాండ్ అంతా ఇంతా కాదు.
అయితే అందరూ అనుకుంటున్నట్టు పుష్ప 2తో ఆగదట. మూడో భాగానికి కూడా సిద్ధంగా ఉండమని దర్శకుడు సుకుమార్ తనతో చెప్పినట్టు ఇటీవలే ఫహద్ ఫాసిల్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ మీద ఒక డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ ని సుకుమార్ ప్లాన్ చేసుకున్నారు. అది బన్నీ దృష్టికి వచ్చాక సినిమాగా మారింది. ముందు మూడు గంటల్లో చెప్పేద్దాం అనుకున్న పుష్పరాజ్ కథ కాస్తా అలా అలా పెరుగుతూ ఏకంగా త్రీ పార్ట్స్ కు వెళ్లిపోయింది.
ఇదంతా ఫహదే చెప్పాడు. వినడానికి బాగానే ఉంది కానీ పుష్ప 3 అంటే అల్లు అర్జున్ మరో రెండేళ్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇదేమి బాహుబలి తరహాలో ఫాంటసీ డ్రామా కాదు కాబట్టి ఒక్క సీక్వెల్ తో ఆపేస్తే బెటరేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పుష్ప 2నే ఇప్పటిదాకా మొదలుపెట్టలేదు. మార్చి నుంచి అంటూ ఆగస్ట్ దాకా తీసుకొచ్చారు. ఇంకా ఆడిషన్లు పూర్తవ్వలేదు. ఎలా చూసినా 2023 సమ్మర్ కి రిలీజ్ చేయడమే పెద్ద టాస్క్ అయ్యేలా ఉంది. మరి పుష్ప 3 మీద అభిమానులు ఆశలు పెట్టుకోవచ్చా.