ఇండియా టుడే మీద బన్నీ బొమ్మ

ఇప్పుడంటే వార మాస పత్రికలు చదివేవాళ్ళు తగ్గిపోయారు కానీ నెట్ లేని కాలంలో మ్యాగజైన్లదే రాజ్యం. స్వాతి, ఆంధ్రప్రభ, సుప్రభాతం, నవ్య ఇలా రకరకాల పేర్లతో చదివే వినోదాన్ని అందించే సంస్థలు లెక్కలేనన్ని ఉండేవి. ఇవన్నీ ఎన్ని ఉన్నా ఇండియా టుడేది ప్రత్యేక స్థానం.రాజకీయ సామాజిక వర్తమాన విషయాల మీద చాలా లోతైన పరిశోధన చేసి కథనాలు ఇచ్చేది. అందుకే ధర ఎక్కువైనా సరే తెలుగు నాట కూడా దీని డిమాండ్ చాలా ఎక్కువ. స్థోమత లేని వాళ్ళు లైబ్రరీ నుంచి అద్దెకు తెచ్చి చదివేవాళ్ళు.

ఈ ఇండియా టుడేలో సాధారణంగా కవర్ పేజీలు జాతీయ అంతర్జాతీయ అంశాల మీద మాత్రమే ఉండేవి. చాలా అరుదుగా సినిమా తారలు, వాళ్ళ కెరీర్ మీద స్పెషల్ ఇష్యూస్ వేసేవాళ్ళు. దానికి మాములు డిమాండ్ ఉండేది కాదు. క్షణాల్లో కాపీలు అమ్ముడుపోయేవి. అలా చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, నాగార్జున తదితరులు ఆ గౌరవం దక్కించుకున్నారు. కట్ చేస్తే ఇండియా టుడే తెలుగు వెర్షన్ తర్వాత క్రమంలో ఆగిపోయింది. రీడర్స్ లేక ప్రస్తుతం హిందీ ఇంగ్లీష్ ఇష్యూస్ ని మాత్రమే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఒక తెలుగు హీరో బొమ్మ ఆ పుస్తకం ముఖచిత్రంగా వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫోటోని ప్రింట్ చేసి ఇటీవలి కాలంలో సౌత్ సినిమా డామినేషన్ నార్త్ లో ఎంతగా పెరిగిపోయిందో ఉదాహరణలు ఇస్తూ అందులో స్టోరీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ మల్టీ స్టారర్ అయినప్పటికీ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కాకుండా బన్నీకి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక మాస్ కమర్షియల్ మూవీతో పుష్ప అక్కడ వందల కోట్లు కొల్లగొట్టడమే దీనికి కారణమని వేరే చెప్పాలా.