సాయి పల్లవి.. ఈ అమ్మడుకు ఉన్న క్రేజు, డిమాండ్ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఎలాంటి స్కిన్ షో చేయకుండా, కేవలం తన సహజ నటనతోనే ఈమె స్టార్ హీరోల స్థాయిలో ఇమేజ్ సొంతం చేసుకుంది. `లవ్ స్టోరీ`, `శ్యామ్ సింగరాయ్` వంటి సూపర్ హిట్స్ తర్వాత సాయి పల్లవి నుండి ఇటీవల `విరాట పర్వం` వచ్చింది. ఈ మూవీ కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా.. సాయి పల్లవికి మాత్రం విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి.
ఇప్పుడు సాయి పల్లవి `గార్గి` అనే మూవీతో సందడి చేసేందుకు సిద్ధమైంది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రమిది. కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మీ, వి.జయప్రకాష్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. తప్పుడు కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్లిన తండ్రి కోసం న్యాయ వ్యవస్థపై కూతురు చేసే పోరాటమే ఈ సినిమా కథ. ఇందులో సాయి పల్లవి మధ్య తరగతి కుటుంబానికి చెందిన గార్గి అనే అమ్మాయిగా, టీచర్ పాత్రలో కనిపించబోతోంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఇకపోతే అన్ని కార్యక్రమాలను చకచకా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం జూలై 15న తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో విడుదల కాబోతోంది. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా దగ్గుబాటి.. తమిళంలో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతికలు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. అమ్మాయిలకు ఇచ్చే స్వేచ్ఛ, తన పెళ్లి వంటి అంశాలపై సైతం సాయి పల్లవి మాట్లాడింది. అసలేమైందంటే.. ఇంటర్వ్యూలో `అమ్మాయిలపై వివక్ష ఉంటుందనే అంశాన్ని గార్గి సినిమాలో ప్రస్తావిస్తున్నారా?` అనే ప్రశ్న సాయి పల్లవి ఎదురైంది.
అందుకు ఆమె బదులిస్తూ.. `సహజంగా ఒక అబ్బాయికి ఇచ్చిన స్వేచ్ఛ అమ్మాయికి ఇవ్వరు. మా ఇంట్లో నన్ను పెళ్లి చేసుకోమని తరచూ అడుగుతుంటారు. ఆ సందర్భాల్లో ఒక అబ్బాయి అయితే ఇలాగే త్వరగా పెళ్లి చేసేస్తారా..? అని అడుగుతుంటా. అలాంటివే ఈ సినిమాలోనూ ఉంటాయి. సందేశాత్మక సినిమా కాకపోయినా.. వినోదాన్ని అందిస్తూనే అందరినీ ఆలోచింపజేస్తుంది.` అని పేర్కొంది. మొత్తానికి పెళ్లి విషయంలో తనకూ ఇంట్లో ఒత్తిడి ఉందని సాయి పల్లవి చెప్పకనే చెప్పేసింది.