తనకు ఎప్పుడు ఏ కాన్సెప్ట్ మీద.. ఎవరి మీద సినిమా తీయాలనిపిస్తే లా తీసేస్తుంటానని.. తాను చాలా న్యూట్రల్ అని చెప్పుకుంటూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. తాను ఎవరికీ భయపడనని.. ఎవరినైనా లక్ష్యంగా చేసుకుని సినిమాలు చేయగలనని కూడా చెప్పుకుంటూ ఉంటాడు. ఇలా చెప్పే వర్మ ఇంతకుముందు కేసీఆర్ మీద సినిమా తీయాలనుకున్నాడు. ఒక పాట కూడా రిలీజ్ చేశాడు. ఐతే ఆ సినిమాకు పెట్టిన క్యాప్షన్ చూసి టీఆర్ఎస్ వాళ్లకు మండింది. ఒక వార్నింగ్ ఇచ్చారో లేదో వర్మ ఆ సినిమాను అటకెక్కించేశాడు.
తాను ఎవరినైనా టార్గెట్ చేయాలనుకుంటే.. వాళ్ల వ్యవహార శైలి ఎలా ఉంటుంది అన్నదాన్ని బట్టే వర్మ సినిమా తీయడం, తీయకపోవడం ఉంటుంది. అలాగే తన వెనుక ఉండి ఆర్థికంగా ఏమేర సపోర్ట్ చేస్తారన్నదాన్ని బట్టి కూడా వర్మ సినిమా తీస్తాడనే అభిప్రాయం బలంగా ఉంది ఇండస్ట్రీ వర్గాల్లో.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు డబ్బులు పెట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అన్నది బహిరంగ రహస్యం. అయినా ఆ సినిమాకు వైకాపాకు సంబంధమే లేదని చెప్పుకున్నాడు వర్మ. చంద్రబాబుకు ఉన్నట్లే జగన్‌కు కూడా ఇలాంటి లొసుగులు లేకుండా ఏమీ లేదు. మరి ఆయన్ని టార్గెట్ చేసి వర్మ సినిమా తీయగలడా? తీస్తే పరిణామాలు ఎలా ఉంటాయో వర్మ సహా అందరికీ తెలుసు.
అందుకే ఓ సినిమా తీస్తే తనకు వైరి వర్గం నుంచి వచ్చే సపోర్ట్ చూసుకోవడమే కాక.. తనకు ప్రమాదం లేని సాఫ్ట్ టార్గెట్లను ఎంచుకుంటాడు వర్మ. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీసి రిలీజ్ చేసుకోగలిగాడంటే వర్మ బాబు వర్గం సాఫ్ట్ టార్గెట్ అన్నది స్పష్టం. అలాగే పవన్‌కున్న మరో సాఫ్ట్ టార్గెట్ పవన్ కళ్యాణ్.
అధికార మార్పిడి జరిగాక కూడా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే సినిమా తీసి బాబు, పవన్‌లను టార్గెట్ చేశాడు వర్మ. అంతటితో ఆగకుండా ఇప్పుడు ‘పవర్ స్టార్’ అంటూ పవన్‌ను టార్గెట్ చేశాడు. సరిగ్గా పవన్ కాపులకు వైకాపా చేస్తున్న అన్యాయం మీద రగడ నడుస్తున్న సమయంలో ఈ సినిమా గురించి ప్రకటించి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడన్నది స్పష్టం.
ఈ సినిమాను ప్రకటించిన టైమింగ్ చూస్తే కచ్చితంగా వర్మకు వైకాపా వర్గాల నుంచి ఆర్థికంగానే కాక అన్ని రకాలుగా సపోర్ట్ అందుతోందన్నది కచ్చితంగా తెలిసిపోతోంది. ఆయన వెనుక ఎవరూ లేరని ఇంకెంతమాత్రం నమ్మే పరిస్థితి లేదు.