రాజా చెయ్యి వేస్తే అని కొన్నేళ్ల కిందట ఓ సినిమా వచ్చింది గుర్తుందా? నారా రోహిత్ మంచి ఫాంలో ఉన్నపుడు చేసిన సినిమా అది. వారాహి చలనచిత్రం లాంటి పెద్ద బేనర్ ఈ సినిమాను నిర్మించడం.. నందమూరి తారకరత్న విలన్ పాత్రను పోషించడం సినిమాపై ఆసక్తిని పెంచాయి. కానీ ఆ చిత్రం అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది.
ఇటు రోహిత్‌కు, అటు తారకరత్నకు మరో అపజయాన్ని మిగిల్చింది. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ చిరుకూరి తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడు అతడికి రెండో ప్రాజెక్టు దక్కింది. ఐతే అది సినిమా కాదు.. వెబ్ సిరీస్. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దాని దర్శకత్వ బాధ్యతలు ప్రదీప్‌కే దక్కాయి.
ప్రముఖ రచయిత మధుబాబు నవలల్లో అత్యంత ఆదరణ పొందిన ‘షాడో’ సిరీస్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. క్రైమ్ నవలలు రాజ్యమేలిన 80వ దశకంలో ‘షాడో’ ఓ సంచలనం. అప్పట్లో నవలా ప్రియులను ‘షాడో’ ఉర్రూతలూగించింది. ఆ సిరీస్‌లో కొత్త నవల కోసం పాఠకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసేవాళ్లు. కొత్త నవల వచ్చిందంటే కాపీలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి.
ఇప్పటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండేది ‘షాడో’ సిరీస్. దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన నవలల్లో ‘షాడో’ సిరీస్ ఒకటి. దాన్నే ఇప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ వెబ్ సిరీస్‌గా మలచనుంది. ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం ఇది తెరకెక్కనుంది. పేరున్న హీరోనే ఇందులో లీడ్ రోల్ చేస్తాడని సమాచారం. మంచి బడ్జెట్లోనే ఈ సిరీస్ తీయాలని చూస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates