ఇలా మెడ‌కు చుట్టుకుందేంటి?

పాపం సాయిప‌ల్ల‌వి.. కెరీర్ ఆరంభం నుంచి మొన్న‌టిదాకా ఏ వివాదం లేకుండా, కేవ‌లం జ‌నం నుంచి అప‌రిమిత‌మైన ప్రేమ‌ను మాత్ర‌మే పొందిన ఆమె.. ఇటీవ‌ల విరాట‌ప‌ర్వం విడుద‌ల‌కు ముందు ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా య‌థాలాపంగా చేసిన వ్యాఖ్య‌ల‌తో ఓ వ‌ర్గానికి టార్గెట్ అయిపోయింది. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించి, గో ర‌క్ష‌కుల గురించి ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ భ‌జ‌రంగ్ ద‌ళ్ ప్ర‌తినిధులు హైద‌రాబాద్ సుల్తాన్ బ‌జార్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు.. సాయిపల్లవికి జూన్‌ 21వ తేదీన నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ నోటీసులను రద్దు చేయాలని కోరుతూ పాయిప‌ల్ల‌వి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సాయి పల్లవి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. దీంతో నోటీసుల‌కు సాయిప‌ల్ల‌వి బ‌దులివ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి త‌లెత్తింది.

నిజానికి సాయిప‌ల్ల‌వి ఇంట‌ర్వ్యూను గ‌మ‌నిస్తే.. ఆమె ఉద్దేశ‌పూర్వ‌కంగా, ఎవ‌రినో కించ‌ప‌ర‌చాల‌ని మాట్లాడిన‌ట్లు అనిపించ‌లేదు. అన్నింటికంటే మాన‌వ‌త్వం గొప్ప‌ద‌ని ఆమె మాట్లాడింది. ఒకప్పుడు కశ్మీర్ పండిట్ల మీద జరిగిన అఘాయిత్యాల గురించి చూపించారని.. కానీ ఇటీవల గోవులను వాహనంలో తరలిస్తున్నందుకు ఒక వ్యక్తిని కొట్టి చంపేశారని.. అప్పుడు జరిగింది అన్యాయం అయినపుడు ఇది కూడా అన్యాయమే కదా.. ఆ తప్పును మనం కూడా చేస్తున్నట్లే కదా అన్నట్లు మాట్లాడింది సాయిపల్లవి.

కాబట్టి తన దృష్టిలో ఎవరి భావజాలం కరెక్ట్ అనేది ముఖ్యం కాదని.. మనం మంచి మనుషులుగా ఉండడం, మానవత్వం చూపించడం ప్రధానం అని సాయిపల్లవి పేర్కొంది. ఆమె వ్యాఖ్యలు సహేతుకంగానే ఉన్నప్పటికీ.. హిందుత్వ వాదులను, బీజేపీని తప్పుబట్టిందంటూ ఓ వర్గం ఆమెను టార్గెట్ చేసింది. త‌న వ్యాఖ్య‌ల‌పై సాయిప‌ల్ల‌వి వివ‌ర‌ణ ఇచ్చినా ఫ‌లితం లేక‌పోయింది. ఈ విష‌యం పోలీస్ కేసు వ‌ర‌కు వెళ్ల‌డం, కోర్టులోనూ సాయిప‌ల్ల‌వికి ఎదురు దెబ్బ‌ త‌గ‌ల‌డంతో వ్య‌వ‌హారం సీరియ‌స్‌గానే క‌నిపిస్తోంది. త‌న వ్యాఖ్య‌లు ఇలా మెడకు చుట్టుకుంటాయ‌ని సాయిప‌ల్ల‌వి ఊహించి ఉండ‌క‌పోవ‌చ్చు.