సౌత్ పై బాలీవుడ్ స్టార్ల మోజు ఈ రేంజులో ఉందా?

సౌత్ హీరోలు, దర్శకులు నార్త్ మార్కెట్‌ను కొల్లగొట్టేస్తుంటే.. బాలీవుడ్ హీరోలు సౌత్‌లో మార్కెట్ పెంచుకోవడం మీద దృష్టిసారిస్తున్నారిప్పుడు. బాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ చిత్రాలన్నీ దక్షిణాది భాషల్లోనూ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ ఈ విషయంలో మరింతగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అతను తమిళ దర్శకుడు అట్లీతో ‘జవాన్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. దానికి మంచి స్పందన వచ్చింది.

ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నది కూడా దక్షిణాది అమ్మాయి అయిన నయనతార అన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. అతను సంగీతం అందిస్తున్న తొలి హిందీ చిత్రం ఇదే. ఇక తాజా సమాచారం ప్రకారం ‘జవాన్’లో విలన్‌గా విజయ్ సేతుపతి నటించబోతున్నాడట. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

గతంలో షారుఖ్‌తో కలిసి విజయ్ సేతుపతి ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అప్పుడు విజయ్ గురించి షారుఖ్ చాలా గొప్పగా మాట్లాడాడు. అతను మేటి నటుడని చెప్పాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. షారుఖ్ లాంటి సూపర్ స్టార్‌‌ను విజయ్ సేతుపతి లాంటి మేటి నటుడు ఢీకొడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. హీరోగా మంచి స్థాయి అందుకున్నప్పటికీ.. క్యారెక్టర్, విలన్ రోల్స్ వదిలిపెట్టట్లేదు సేతుపతి.

ఇటీవలే ‘విక్రమ్’లో విలన్ పాత్రలో అతను అదరగొట్టాడు. నెగెటివ్ రోల్స్‌లోనే విజయ్ బెస్ట్ పెర్ఫామెన్స్ బయటికి వస్తుంటుంది. నిజానికి అతను ‘లాల్ సింగ్ చద్దా’తోనే బాలీవుడ్లో అడుగు పెట్టాల్సింది. కానీ డేట్లు సర్దుబాటు కాక కుదర్లేదు. ఆ పాత్ర తర్వాత నాగచైతన్యకు దక్కింది. ఇప్పుడు షారుఖ్ సినిమాలో విలన్ పాత్రను మాత్రం విజయ్ వదులుకునే ఛాన్స్ లేదు. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రాబోతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 1న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.