టాప్ 10 కలెక్షన్లలో 6 మనవే

గత ఏడాది కాలంగా కలెక్షన్ల ట్రెండ్ గమనిస్తే సౌత్ సినిమా డామినేషన్ ఇండియన్ బాక్సాఫీస్ మీద ఏ రేంజ్ లో పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. 2021 – 22 వసూళ్ల ట్రెండ్ ని విశ్లేషిస్తే ఈ వాస్తవం తేటతెల్లమవుతుంది. కెజిఎఫ్ చాఫ్టర్ టూ 1228 కోట్ల వసూళ్లతో నెంబర్ వన్ పొజిషన్ లో ఉండగా ఆర్ఆర్ఆర్ 1131 కోట్లతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. మూడో ప్లేస్ లో విక్రమ్ 400 కోట్లను దాటేశాక ఓటిటికి వెళ్లిపోయింది. నాలుగో ర్యాంక్ లో పుష్ప ది రైజ్ పార్ట్ వన్ 370 కోట్లు రాబట్టి నార్త్ బెల్ట్ లో రాబట్టి సత్తా చాటింది.

ఆ తర్వాత వరుసగా ది కాశ్మీర్ ఫైల్స్ (345 కోట్లు), సూర్యవంశీ(292 కోట్లు), భూల్ భూలయ్యా టూ(264 కోట్లు), విజయ్ బీస్ట్(227 కోట్లు), చివరి స్థానంలో సర్కారు వారి పాట(192 కోట్లు)ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన గ్రాస్ లెక్కలు. మొత్తం పది సినిమాల్లో ఆరు దక్షిణాదివే ఉండటం ట్రేడ్ ని సైతం విస్మయపరుస్తోంది. ఒకప్పుడు తెలుగు తమిళ డబ్బింగులకు కనీస ఆదరణ లేని స్థితి నుంచి ఇప్పుడు వందల కోట్లు కొల్లగొట్టే రేంజ్ కి చేరుకోవడం దాకా జరిగిన పరిణామ క్రమంలో మొదటి పునాది వేసింది బాహుబలే.

ఇదిలాగే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖాన్ల ద్వయం రెండుమూడేళ్ళకు ఒక సినిమా చేయడం ఇప్పుడీ పరిస్థితికి కారణమన్న కామెంట్ లో కొంత నిజముంది కానీ బడ్జెట్ లో క్వాలిటీలో ఏకంగా సుప్రసిద్ధ హాలీవుడ్ మేకర్స్ తో ప్రశంసలు అందుకునే స్థాయికి ఎదిగిన టాలీవుడ్ కోలీవుడ్ దర్శకుల ఆలోచనలన్నీ ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్ లో సాగుతున్నాయి. అందుకే నిఖిల్ లాంటి మీడియం రేంజ్ హీరోలు కూడా తమ చిత్రాలను హిందీలో కూడా వెళ్లేలా ప్లానింగ్ చేసుకుంటున్నారు. అందుకే సౌత్ మూవీ దెబ్బకు బాలీవుడ్ అబ్బా అంటోందన్నది నిజం.