ఏదైనా క్యారెక్ట‌ర్‌తో క‌నెక్ట్ అయితే దాన్ని లాక్‌ చేస్తాడు

టాలీవుడ్లో అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్‌ల‌ది సూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌గా చెప్పొచ్చు. వీళ్లిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి సినిమా జులాయి సూప‌ర్ హిట్ట‌యింది. రెండో చిత్రం స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి అంచ‌నాల‌ను అందుకోక‌పోయినా.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లే రాబ‌ట్టింది.

ఇక మూడో సినిమా అల వైకుంఠ‌పుర‌ములో గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. భారీ వ‌సూళ్ల‌తో తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టేసింది. ఈ క‌ల‌యిక‌లో మ‌రో సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తుంటార‌న‌డంలో సందేహం లేదు.

త‌న కోరిక కూడా అదే అంటున్నాడు అల్లు అర్జున్ స‌న్నిహితుడు, ప్ర‌స్తుతం గీతా ఆర్ట్స్ బేన‌ర్‌ను అన్నీ తానై న‌డిపిస్తున్న యువ నిర్మాత బ‌న్నీ వాసు. సందిగ్ఘ‌త నెల‌కొన్న బ‌న్నీ కొత్త సినిమాల లైన‌ప్ గురించి అత‌ను ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు. ఈ సంద‌ర్భంగా బ‌న్నీ, త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ జ‌త క‌ట్టే అవ‌కాశాలున్న‌ట్ల సంకేతాలిచ్చాడు.

బన్నీ పుష్ప2 ప‌నుల్లో బిజీలో ఉన్నప్పటికీ దీని త‌ర్వాత చేయాల్సిన సినిమాల కోస‌మ‌ని కథలు వింటున్నట్లు చెప్పిన బ‌న్నీ వాసు…ఇలా వింటున్న క‌థ‌ల్లో ఏదైనా క్యారెక్ట‌ర్‌తో క‌నెక్ట్ అయితే దాన్ని లాక్‌ చేస్తాడ‌ని చెప్పాడు. ప్రస్తుతం బ‌న్నీ మూడు కథల మీద దృష్టిపెట్టిన‌ట్లు వాసు తెలిపాడు.

త‌ర్వాతి సినిమా ఏద‌నే విష‌యంలో క్లారిటీ లేద‌ని, అది బ‌న్నీ చేతుల్లోనే ఉంద‌ని అన్నాడు.‘పుష్ప’ తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా అనుకున్నామ‌ని.. అనుకోకుండా ‘పుష్ప’ రెండు భాగాలు కావడంతో ఆ సినిమా ఆల‌స్యం అయిందని.. ఆ కథ మీద వర్క్ జ‌రుగుతోంద‌ని చెప్పాడు వాసు.

బ‌న్నీ ఫ్రీ అయ్యాక‌ మళ్లీ షెడ్యూళ్లు వేసుకుని ఆ సినిమా ప్రారంభిస్తాన్నాడు. త‌న‌ అభిమాన దర్శకుడు త్రివిక్రమ్‌తో బ‌న్నీ ఇంకో సినిమా చేస్తాడ‌ని.. మహేష్ మూవీ తర్వాత బన్నీతో చేస్తే బావుంటుందని త‌న‌ అభిప్రాయమ‌ని.. త‌న ఆలోచ‌న‌ను ఇప్పటికే త్రివిక్రమ్‌ ముందు ఉంచాన‌ని.. ఏం జ‌రుగుతుందో చూడాల‌ని వాసు పేర్కొన్నాడు.