హను రాఘవపూడి.. తెలుగులో మంచి అభిరుచి ఉన్న దర్శకుడు. తన ప్రతి సినిమాలోనూ కొత్తగా ఏదో చెప్పాలనుకుంటాడతను. అతి భావుకత ప్రతి పాటలో, సన్నివేశంలో కనిపిస్తుంటుంది. కథల పరంగా ప్రతిసారీ వైవిధ్యం చూపించే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ అతడి సినిమాల్లో ఏదో ప్రత్యేకత ఉన్నట్లే ఉంటుంది. కొంత వరకు బాగా ఆకట్టుకుంటాయి. కానీ చివరికి వచ్చేసరికి మిశ్రమానుభూతి కలుగుతుంది.
తొలి సినిమా ‘అందాల రాక్షసి’, రెండో చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చాలా బాగా మొదలై.. మధ్యలో దారి తప్పి.. చివరికి నిరాశనే మిగులుస్తాయి. ఇక ఆ తర్వాత అతను తీసిన ‘లై’, ‘పడి పడి లేచె మనసు’ సినిమాల సంగతి సరేసరి. సగం వరకు వారెవా అనిపించినా.. ద్వితీయార్ధంలో ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తాయి. చివరికొచ్చేసరికి దండం పెట్టసి బయటికి వచ్చారు ప్రేక్షకులు. అందుకే అవి రెండూ పెద్ద డిజాస్టర్లయ్యాయి.
ముఖ్యంగా ‘పడి పడి లేచె మనసు’ చూసిన ప్రేక్షకులైతే బెంబేలెత్తిపోయారు. ఆ సినిమా నిర్మాతకు దారుణమైన నష్టాలు మిగిల్చింది. దీంతో హనుకు ఇంకో సినిమాలో అవకాశం దక్కుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద బేనర్లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా లాంటి మంచి కాస్టింగ్‌తో కాస్త పెద్ద బడ్జెట్లోనే సినిమా చేసే అవకాశం దక్కింది. ఆ చిత్రమే.. సీతారామం. ఈ సినిమా టైటిల్ దగ్గర్నుంచి మొదలుపెడితే.. ప్రతి ప్రోమో వారెవా అనిపిస్తోంది. ముఖ్యంగా పాటలైతే ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి.
ఇంతకముందు రిలీజ్ చేసిన సీతా పాట, ఇప్పుడు లాంచ్ చేసిన ఇంతందం సాంగ్ ఇన్‌స్టంట్‌గా ప్రేక్షకులకు ఎక్కేశాయి. తాజా పాటలో అయితే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ హను అభిరుచి కనిపిస్తోంది. అసలు రాజీ అన్నదే లేకుండా చిత్రీకరణ సాగినట్లుంది. కానీ ఇలా ప్రోమోలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని అంచనాలు పెంచుకునేలా చేయడం హనుకు ముందు నుంచి అలవాటే. తీరా చూస్తే.. సినిమాను మధ్యలో వదిలేస్తుంటాడు. అందుకే ఆడియన్స్‌లో కొంత భయం కూడా ఉంది. మరి ఈసారైనా అతను ఆ బలహీనతను విడిచిపెట్టి పూర్తి సినిమాతో మెప్పిస్తాడని ఆశిద్దాం.