ఫ్లాపుల వ‌ర‌ద‌ను కృష్ణ‌మ్మ ఆపుతుందా?

నేచుర‌ల్ స్టార్ నాని లాగా మంచి టాలెంట్ ఉండి, ఏ బ్యాగ్రౌండ్ లేకుండా క‌ష్ట‌ప‌డి గుర్తింపు తెచ్చుకున్న‌ న‌టుల్లో స‌త్య‌దేవ్ ఒక‌డు. ఐతే అత‌డి టాలెంటుకి త‌గ్గ పాత్ర‌లు, సినిమాలు ప‌డ‌క‌, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌రిస్థితులు క‌లిసి రాక అత‌ను ఒక స్థాయికి మించి ఎద‌గ‌లేక‌పోయాడు. నానికి భ‌లే భ‌లే మ‌గాడివోయ్ లాగా అత‌డికి స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టే సినిమా ప‌డ‌క‌పోవ‌డం మైనస్ అయింది. అడ‌పా ద‌డ‌పా మంచి సినిమాలే చేస్తున్నా అత‌ను కోరుకున్న పెద్ద క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ మాత్రం ద‌క్క‌ట్లేదు స‌త్య‌దేవ్‌కు.

గ‌త ఏడాది కాలంలో స‌త్య‌దేవ్ తిమ్మ‌ర‌సు, స్కైలాబ్, గాడ్సే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. వీటిలో తిమ్మ‌ర‌సు, స్కైలాబ్ ఉన్నంతలో మంచి సినిమాలే అయినా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొంద‌లేదు. గాడ్సే ఏ ర‌కంగానూ ప్రేక్ష‌కులను మెప్పించ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతానికి అత‌డి ఆశ‌లు గుర్తుందా శీతాకాలం మీద ఉన్నాయి. కానీ ఆ సినిమా వాయిదాల మీద వాయిదాలు ప‌డుతోంది.

ఐతే ఇప్పుడు స‌త్య‌దేవ్ కొత్త‌గా చేస్తున్న ఓ సినిమా గురించి ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. అగ్ర ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని వీవీ గోపాల‌కృష్ణ అనే కొత్త ద‌ర్శ‌కుడు రూపొందిస్తున్నాడు. ఈ చిత్ర టైటిల్, ఫ‌స్ట్ లుక్‌ను ఆదివార‌మే లాంచ్ చేశారు. కృష్ణ‌మ్మ అనే లేడీ ఓరియెంటెడ్ టైటిల్ పెట్టారీ చిత్రానికి.

ఐతే ఈ క‌థాంశం ఆ త‌ర‌హాదే కానీ.. కృష్ణ‌మ్మ అనేది హీరోయిన్ పేరు కాదు. ఈ క‌థ మొత్తం కృష్ణ‌మ్మ ఒడ్డున జ‌రుగుతుంది. బాగా వ‌యొలెన్స్‌తో ముడిప‌డ్డ క‌థ ఇది. మాస్ అంశాల‌కు లోటు ఉండ‌దు. క‌థ కూడా బలంగా ఉంటుంద‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల మాట‌. ముందు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో తీయాల‌నుకున్న సినిమా ఇది. భ‌గ‌వ‌ద్గీత సాక్షిగా అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ త‌ర్వాత హీరో మారాడు. టైటిల్ మారింది. స‌త్య‌దేవ్ కెరీర్‌ను మ‌లుపు తిప్పే సినిమా కృష్ణ‌మ్మ‌ అవుతుంద‌నే టాక్ ఇండ‌స్ట్రీలో ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.