ఇవాళ అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా తన యాభై తొమ్మిదో సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ ని విడుదల చేశారు. కామెడీ హీరోగా ఆ మధ్య వరస ఫ్లాపులు చూశాక మహర్షితో సపోర్టింగ్ రోల్స్ కి వచ్చేసిన నరేష్ కి నాంది విజయం మంచి కిక్ ఇచ్చింది. తనలో అసలైన నటుడిని బయటికి తీయడమే కాక కమర్షియల్ గానూ విజయం సాధించడంతో నెక్స్ట్ కూడా ఎక్కువగా పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న సీరియస్ డ్రామాలనే ఎంచుకుంటున్నాడు. అందులో భాగంగా చేస్తున్నదే ఈ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.
ఎక్కడో మారుమూల అడవుల్లో నివసించే ఒక జాతి. వాళ్లకు కనీస సౌకర్యాలు ఉండవు. కానీ ఓటు హక్కు ఉంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ కార్యక్రమం నిర్వహించడానికి డ్యూటీ మీద హీరో అక్కడికి వెళ్తాడు. తీరా చూస్తే అక్కడ చాలా విపత్కరమైన పరిస్థితులు ఉంటాయి. వాటికి ఎదురీదాలంటే చావు దెబ్బలు తినాల్సి వస్తుంది. తన బాధ్యతను వాళ్ళ మనసులను ఎలా గెలిచాడనేదే ఇందులో మెయిన్ పాయింట్. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు.
అంతా బాగానే ఉంది కానీ ఈ కథలోని బేసిక్ థీమ్ 2017లో వచ్చిన బాలీవుడ్ మూవీ న్యూటన్ ని గుర్తుకు తెస్తుంది. కాకపోతే అది ఎంటర్ టైన్మెంట్ టచ్ తో సాగుతుంది మన అల్లరోడిది పూర్తి భావోద్వేగాల మీద నడిపించినట్టు కనిపిస్తోంది. న్యూటన్ ఆ టైంలో అద్భుత విజయాన్ని సాధించింది. తెలుగులో రీమేక్ చేస్తారనే వార్తలు వచ్చాయి కానీ ఎవరూ ఆ సాహసం చేయలేకపోయారు. ఇప్పుడు ఆ ఛాయల్లో ఈ మారేడుమిల్లి నియోజకవర్గం వస్తోంది. మొత్తానికి హాస్యానికి పూర్తిగా సెలవు చెప్పేసిన నరేష్ మళ్ళీ వినోదాన్ని ఎప్పుడు ఇస్తాడో.