రాజమౌళి డప్పు కొట్టుకోడేంటి?

ఈ రోజుల్లో పబ్లిసిటీ అనేది చాలా ముఖ్యం అయిపోయింది. ఏమీ లేని సినిమా గురించి ఎలా డప్పు కొంటున్నారో అందరం చూస్తూనే ఉన్నాం. రిలీజ్‌కు ముందు, తర్వాత పబ్లిసిటీ ఊదరగొట్టేస్తున్నారు. ఇక సినిమా ఓ మోస్తరు విజయం సాధించిందంటే ఎలివేషన్లు మామూలుగా ఉండట్లేదు. రిలీజ్ తర్వాత నెలల తరబడి ఆ హ్యాంగోవర్లోనే ఉంటారు సినీ జనాలు.

కానీ రాజమౌళి మాత్రం ఇందుకు భిన్నం. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి, ఎక్కువ రీచ్ కోసం రిలీజ్‌కు ముందు ఆయన ప్రమోషన్లు గట్టిగానే చేస్తాడు. తన టీంలోని వారినీ బాగా కష్టపెట్టిస్తాడు. కానీ రిలీజ్ తర్వాత మాత్రం జక్కన్న సైలెంట్ అయిపోతాడు. ఇక సినిమానే మాట్లాడుతుంది.. తనను తాను ప్రమోట్ చేసుకుంటుంది అనేది ఆయన ధీమా. జక్కన్న ప్రతి సినిమాకూ అదే జరుగుతుంటుంది. తన సినిమా తిరుగులేని బ్లాక్‌బస్టర్ అయినప్పటికీ.. రిలీజ్ తర్వాత దాని గురించి జక్కన్న పెద్దగా మాట్లాడడు. సక్సెస్ చూసి విర్రవీగడు.

‘ఆర్ఆర్ఆర్’ విషయమే తీసుకుంటే.. ఈ చిత్రం రిలీజ్ తర్వాత ఎంతటి ప్రకంపనలు రేపిందో తెలిసిందే. ఇండియా సహా వివిధ దేశాల్లో థియేట్రికల్ రన్ అయిపోయాక కూడా ఈ సినిమా రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. నెట్ ఫ్లిక్స్ ద్వారా హిందీ వెర్షన్ డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చాక హాలీవుడ్ ఫిలిం సెలబ్రెటీలు, అక్కడి ప్రేక్షకులు ఈ సినిమా చూసి వెర్రెత్తిపోయారు. ఆపై యుఎస్‌ సహా కొన్ని చోట్ల థియేటర్లలో రీ రిలీజ్ చేస్తే రెస్పాన్స్ మామూలుగా లేదు. కానీ ఈ రెస్పాన్స్ గురించి రాజమౌళి ఇప్పటిదాకా అసలు స్పందించింది లేదు.

తాజాగా ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అవార్డుల‌కు కూడా నామినేట్ అయింది. దాని గురించి కూడా జ‌క్క‌న్న స్పందించ‌లేదు. సైలెంటుగా రిలాక్స్ అవుతున్నాడు తప్పితే.. సోషల్ మీడియాలో కానీ, బయట కానీ తన సినిమా ఊసే ఎత్తడం లేదు. వేరే సినిమాల ఈవెంట్లకు వస్తున్నాడు. సోషల్ మీడియాలో కూడా వేరే చిత్రాల గురించే స్పందిస్తున్నాడు తప్ప.. అస్సలు తన సినిమా సంచలనాల గురించి మాట్లాడట్లేదు. తన డప్పు తాను కొట్టుకోవట్లేదు. తాజాగా ఆయన ఏదో కొత్త ప్రాజెక్ట్ కోసమని ఫారిన్లో పర్యటిస్తున్నాడు. మళ్లీ పని మీద పడ్డాడే తప్ప ఇలా తన ఘనతల గురించి అసలు డప్పు కొట్టుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.