ఊహించిన దానికన్నా చాలా ముందే విరాట పర్వం ఓటిటి అనౌన్స్ మెంట్ వచ్చేసింది. జూలై 1 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించేసింది. అంటే సరిగ్గా 14 రోజులు పూర్తవ్వడం ఆలస్యం ఇలా స్మార్ట్ స్క్రీన్ పైకి తీసుకొస్తున్నారన్న మాట. ఒకపక్క టాలీవుడ్ లో ఇకపై నిర్మాతలు 50 రోజుల తర్వాతే ఓటిటికి ఇవ్వాలనే నిబంధనను పెట్టుకున్న రోజే ఈ ట్విస్టు జరగడం విశేషం. ఎలాగూ ఈ సినిమాను చూడని వాళ్ళు కోట్లలో ఉన్నారు కాబట్టి డిజిటల్ లో వ్యూస్ భారీగా వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఇదంతా బాగానే ఉంది కానీ విరాటపర్వం రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు గట్రా మాములుగా చేయలేదు. కర్నూల్ నుంచి వరంగల్ దాకా వేడుకలు నిర్వహించారు. టీవీ9తో మొదలుపెట్టి సిద్ధూ జొన్నలగడ్డ దాకా లెక్కలేనన్ని ప్రోగ్రాంలు చేశారు. ముఖ్యంగా సాయిపల్లవి కష్టం గురించి మాటల్లో చెప్పేది కాదు. బరువంతా తన మీదే పెట్టేయడంతో నో అనకుండా అడిగిన చోటల్లా పబ్లిసిటీలో పాలు పంచుకుంది. ఇంతా చేసింది థియేటర్లలో బొమ్మ బాగా ఆడి నిర్మాతకు నాలుగు డబ్బులు రావాలనే కదా.
చూస్తే ఇప్పుడిలా యుటర్న్ తీసుకోక తప్పలేదు. కంటెంట్ మీద ఎన్ని ప్రశంసలు వచ్చినా అవి కేవలం సోషల్ మీడియాకే పరిమితమయ్యాయి. జనం హాలు దాకా వచ్చి చూసేందుకు ఈ నక్సల్ లవ్ స్టోరీ మీద ఆసక్తి చూపించలేదు. కట్ చేస్తే వారం లోపే నెగటివ్ షేర్లు పడ్డాయి. దాంతో ముందే అగ్రిమెంట్ అలా చేసుకున్నారో లేక ఆచార్య, రాధే శ్యామ్ లాగా తిరిగి కొత్తగా రాసుకున్నారో తెలియదు కానీ మొత్తానికి చాలా ముందుగా ఓటిటి బాట పట్టేశారు . అదేదో ముందే చేసుకుంటే ఇంకా మంచి రేట్ తో పాటు రెస్పాన్స్ కూడా అదిరేదేమో.