ఒకేసారి భారీ సినిమాలన్నీ ఓటిటీలోకి వచ్చేస్తున్నాయ్!

సినీ వినోదం కరవైపోతోందని డీలా పడిపోయిన సినీ ప్రియులకు శుభ వార్త. ఏవో చిన్నా చితకా సినిమాలు ఓటిటీలో రావడం కాదు. ఏకంగా భారీ సినిమాలే కట్ట కట్టుకుని మీ టీవీలోకి వచ్చేస్తున్నాయి. సినిమా థియేటర్లు ఓపెన్ అవుతాయని ఆశగా ఎదురు చూసిన బాలీవుడ్ నిర్మాతలు ఇక లాభం లేదని డిసైడ్ అయిపోయారు.

అక్షయ్ కుమార్ ‘లక్ష్మి బాంబ్’, అజయ్ దేవగన్ నటించిన ‘భుజ్’ హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతున్నాయి. అంతే కాదు హాట్ స్టార్ మరో మూడు క్రేజీ సినిమాలు కూడా కొనేసింది. వరుణ్ ధావన్ నటిస్తున్న కూలీ నెంబర్ 1రీమేక్, అలియా భట్ సినిమా సడక్ 2 కూడా ఇందులోనే విడుదల కానున్నాయి. అభిషేక్ బచ్చన్ నటించిన బిగ్ బుల్ చిత్రం కూడా హాట్ స్టార్ లో దర్శనం ఇవ్వనుంది.

ఈ సినిమాలన్నీ హాట్ స్టార్ లో వస్తున్నాయని సోమవారం ఆ చిత్ర కథానాయకులు, కథానాయికలు కలిసి ప్రకటించనున్నారు. ఈ దెబ్బతో ఇండియాలో ఓటిటీ గేమ్ వేడెక్కబోతోంది. ఇంతకాలం మీన మేషాలు లెక్క పెట్టిన తెలుగు నిర్మాతలు కూడా ఇక ముందుకి కదిలే సమయం ఆసన్నమయింది.