మనసానమః అని ఒక చిన్న షార్ట్ ఫిలిం. కేవలం 16 నిమిషాల నిడివి ఉంటుందంతే. కొన్నేళ్ల కిందట యూట్యూబ్‌లోకి వచ్చిన ఈ షార్ట్.. యువ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని అనూహ్యమైన ఆదరణ తెచ్చుకుంది. ఐతే కేవలం ప్రేక్షకాదరణతో సంతృప్తి చెందడం కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ షార్ట్ ఫిలిం మీద అవార్డుల వర్షం కురిసింది. అవార్డులంటే ఐదో పదో ఇరవయ్యో ముప్పయ్యో కాదు.. 500 దాటిపోయాయి.
గత కొన్నేళ్లలో అధికారికంగా 513 అవార్డులు గెలుచుకున్న మనసానమః షార్ట్ ఫిలిం ఆస్కార్ అవార్డుల రేసులో కూడా నిలవడం విశేషం. అక్కడ సక్సెస్ కాకపోయినా.. ఇప్పుడీ షార్ట్ ఫిలిం అరుదైన ఘనత సాధించింది. అత్యధిక అవార్డులు గెలుచుకున్న షార్ట్ ఫిలింగా దీన్ని గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించడం విశేషం.
తాజాగా ఈ షార్ట్ ఫిలిం రూపకర్త దీపక్.. గిన్నిస్ బుక్ నుంచి సర్టిఫికెట్ కూడా అందుకున్నాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ షార్ట్ చాలా సింపల్‌గా ఉంటుంది. కథాంశం కొత్తదేమీ కాదు. ప్రేమ దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ అమ్మాయిల కన్ఫ్యూజన్లో ఉంటారని.. వాళ్లను డీల్ చేయడం చాలా కష్టమని చెబుతూ.. అబ్బాయి కోణంలో ఆసక్తికరంగా కథను చెప్పే ప్రయత్నం చేశాడు దీపక్.
నరేషన్ చాలా ట్రెండీగా.. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇదొక చిన్న షార్ట్ ఫిలిమే అయినా సంగీతం, ఛాయాగ్రహణం, ఎఫెక్ట్స్ మంచి క్వాలిటీతో ఉంటాయి. యూత్‌కు బాగా నచ్చేలా, ట్రెండీగా ఉన్న ఈ షార్ట్.. తెలుగులో సక్సెస్ అయ్యాక పలు భాషల్లో అనువాదం అయింది. అన్ని చోట్లా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఐతే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దీనికి ఇన్ని అవార్డులు రావడం, గిన్నిస్ బుక్ సైతం దీన్ని గుర్తించడం విశేషమే.