రిలీజై నాలుగు వారాలు.. టికెట్లు దొరకట్లా

విక్రమ్.. విక్రమ్.. విక్రమ్.. ఈ నెల ఆరంభం నుంచి దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. కెరీర్ దాదాపు ముగిసిందనుకున్న కమల్ హాసన్.. కెరీర్లో ఈ దశలో, ఈ వయసులో బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న ప్రభంజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా మీద పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరూ రెట్టింపుకు మించి లాభాల్లో ఉన్నారంటే ఇదెంత పెద్ద హిట్టో చెప్పాల్సిన పని లేదు.

తమిళనాట అన్ని రికార్డులనూ బద్దలు కొడుతూ ఆల్ టైం బ్లాక్‌బస్టర్‌గా అవతరించిందీ సినిమా. మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా తొలి వీకెండ్ తర్వాత డల్ అయిపోయి.. రెండో వీకెండ్లో ఓ మోస్తరు వసూళ్లు సాధించి.. ఆ తర్వాత చల్లబడిపోతున్న ఈ రోజుల్లో.. ‘విక్రమ్’ సినిమా నాలుగో వీకెండ్లో బాక్సాఫీస్ దగ్గర చూపిస్తున్న దూకుడు చూస్తే షాకవ్వాల్సిందే. తమిళనాట శని, ఆదివారాలకు చాలా థియేటర్లలో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. చాలా షోలకు అడ్వాన్స్ ఫుల్స్ పడుతున్నాయి.


‘విక్రమ్’ తర్వాత తమిళంలో చాలా సినిమాలు రిలీజయ్యాయి. అవేవీ కూడా దీనిపై ప్రభావం చూపలేకపోయాయి. సినిమాలు వస్తున్నాయి. వెళ్తున్నాయి. కానీ ‘విక్రమ్’ జోరు తగ్గట్లేదు. ఇలా నాలుగో వీకెండ్లో కూడా ఓ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం.. కొత్త సినిమాలను వెనక్కి నెట్టడం అరుదైన విషయమే. ఇప్పటికే ఈ సినిమా ఓవరాల్ వసూళ్లు రూ.380 కోట్లకు చేరుకున్నాయి. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.400 కోట్ల గ్రాస్ మార్కును దాటడం లాంఛనమే కావచ్చు.

తమిళనాట ‘బాహుబలి-2’ సహా అన్ని రికార్డులు బద్దలు కొట్టేసిన ‘విక్రమ్’.. ఒక్క ‘2.ఓ’ ఓవరాల్ రికార్డులను మాత్రమే అందుకునేలా లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన నితిన్ సంస్థ ‘శ్రేష్ఠ్ మూవీస్’ పెట్టుబడి మీద మూడు రెట్ల లాభాలను అందుకుంటుండడం విశేషం. ‘విక్రమ్’ హక్కులను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రూ.6 కోట్లకే కొన్నారు.