త్రివిక్రమ్ డామినేషన్.. అతనొప్పుకుంటాడా?

త్రివిక్రమ్ దర్శకత్వం చేయకుండా ఏ సినిమాకు రైటింగ్ బాధ్యతలు తీసుకున్నా ఆయన డామినేషనే కనిపిస్తుంటుంది. తన రచనతో త్రివిక్రమ్ వేసే ముద్ర అలాంటిది మరి. కేవలం రచయితగా ఉన్న రోజుల్లో స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి లాంటి చిత్రాల్లో త్రివిక్రమ్ ఎంతగా మెప్పించాడో తెలిసిందే. ఆ చిత్రాలకు దర్శకుడు విజయ భాస్కరే అయినా.. ఎక్కువగా పేరొచ్చింది, ఆ సినిమాలు అంత విజయం సాధించడానికి కారణమైంది త్రివిక్రమే.

‘నువ్వే నువ్వే’తో దర్శకుడిగా మారాక వేరే సినిమాలకు రాయడం ఆపేశాడు త్రివిక్రమ్. కానీ మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ కోసమని కొన్ని చిత్రాలకు స్క్రిప్టు బాధ్యతలు తీసుకున్నాడు. వాటిలో అన్నీ దాదాపుగా రీమేక్‌లే. ‘తీన్ మార్’ సినిమాలో ప్రతి డైలాగులోనూ త్రివిక్రమ్ ముద్ర కనిపిస్తుంది. ఆ సినిమా ఫ్లాప్ అయినా.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమాను ఇప్పటికీ మళ్లీ మళ్లీ చూసే జనాలున్నారు. వాళ్లందరూ త్రివిక్రమ్‌నే కొనియాడుతుంటారు తప్ప.. దర్శకుడు జయంత్ గురించి పట్టించుకోరు.

ఇక ఈ మధ్యే రిలీజైన ‘భీమ్లా నాయక్’ సంగతి సరేసరి. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ చాలా వరకు త్రివిక్రమే తీసుకున్నాడు. దర్శకుడు సాగర్ చంద్రకు పెద్దగా పేరు రాలేదు. మలయాళ ఒరిజినల్‌కు చేసిన మార్పులు చేర్పులు, మాటలతో త్రివిక్రమే హైలైట్ అయ్యాడు తప్ప దర్శకుడికి ఎలివేషన్ రాలేదు. ఇప్పుడిక త్రివిక్రమ్.. పవన్ చేయబోయే మరో సినిమాకు స్క్రిప్టు సమకూర్చాడు. తమిళ సినిమా ‘వినోదియ సిత్తం’కు ఇది రీమేక్. కొన్ని రోజుల అనిశ్చితి తర్వాత ఈ సినిమాకు రంగం సిద్ధమైందని.. త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతోందని అంటున్నారు. ఒరిజినల్ తీసింది నటుడు, దర్శకుడు సముద్రఖని. మాతృకలో అతనో కీలక పాత్ర పోషించాడు కూడా. దైవదూతగా కనిపించే ఆ పాత్రనే తెలుగులో పవన్ చేయబోతున్నాడు. అతడి మార్గనిర్దేశంలో నడిచే వ్యక్తిగా సాయిధరమ్ తేజ్ కనిపించనున్నాడు. రీమేక్‌కు కూడా సముద్రఖనినే దర్శకుడు అయినప్పటికీ.. ఒరిజినల్ స్క్రిప్టుకు త్రివిక్రమ్ మార్పులు చేర్పులు చేసి డైలాగ్స్ రాశాడంటున్నారు.

ఇంతకుముందు త్రివిక్రమ్ స్క్రిప్టు సమకూర్చిన రీమేక్ సినిమాలకు ఫామ్‌లో లేని జయంత్, పెద్దగా ఇమేజ్ లేని సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇప్పుడు సముద్రఖని పేరున్న దర్శకుడు, పైగా తాను తీసిన సినిమానే రీమేక్ చేయబోతున్నాడు. మరి త్రివిక్రమ్ డామినేషన్‌ను అతను తట్టుకోగలడా.. తన స్క్రిప్టును మార్చేస్తే అతను ఒప్పుకుని ఇగో క్లాషెస్ లేకుండా సినిమా పూర్తి చేస్తాడా అన్నది సందేహం.