నాగ్ హిట్ టైటిల్ వాడేశారు

గ‌త కొన్నేళ్ల‌లో త‌మిళ స్టార్లు చాలామంది తెలుగులో త‌మ మార్కెట్ అంతా కోల్పోగా.. ఒక‌ప్పుడు ఇక్క‌డ ఏమాత్రం ఫాలోయింగ్ లేని త‌మిళ టాప్ స్టార్ విజ‌య్ ఈ మ‌ధ్య బాగానే మార్కెట్ సంపాదించాడు. తుపాకి, జిల్లా, అదిరింది, విజిల్, మాస్ట‌ర్ సినిమాలు తెలుగులో బాగా ఆడి విజ‌య్ పాపులారిటీని పెంచాయి.

ఈ ఊపులో ఇప్పుడు విజ‌య్ నేరుగా తెలుగు సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మాత‌గా అత‌డి కొత్త చిత్రం త‌మిళంతో పాటు తెలుగులో ఒకేసారి తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం విజ‌య్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేశారు.

వంశీ చివ‌రి సినిమా మ‌హ‌ర్షిలో మాదిరే ఇందులోనూ హీరో సూటూ బూటేసుకుని పెద్దింటి కుర్రాడిలా క‌నిపిస్తున్నాడు. ఈ చిత్రానికి త‌మిళంలో వారిసు అనే టైటిల్ పెట్టి, ది బాస్ రిట‌ర్న్స్ అనే క్యాప్ష‌న్ జోడించారు.

త‌మిళంలో వారిసు అంటే వార‌సుడు అని అర్థం. ద్విభాషా చిత్రం అంటే మామూలుగా ఒకేసారి రెండు భాష‌ల్లోనూ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయాల్సింది, తెలుగు టైటిల్ కూడా ప్ర‌క‌టించాల్సింది. కానీ విజ‌య్ త‌మిళంలో టాప్ స్టార్ కాబ‌ట్టి, త‌మిళమే త‌మ ప్ర‌యారిటీ అని చెప్పడానికి ముందు త‌మిళంలో ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేశారు.

ఒక గంట గ్యాప్ ఇచ్చి తెలుగు టైటిల్‌తో వేరుగా ఫ‌స్ట్ లుక్ వ‌దిలారు. చిత్ర‌మైన విష‌యం ఏంటంటే.. రెండు భాష‌ల్లోనూ ఫ‌స్ట్ లుక్‌లో ఇంగ్లిష్ టైటిలే పెట్టారు. త‌మిళం, తెలుగు భాష‌ల్లో టైటిల్స్ డిజైన్ చేయ‌లేదు. ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే వారుసుడు పేరుతో అక్కినేని నాగార్జున న‌టించిన సూప‌ర్ హిట్ సినిమా ఒకటుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

90వ ద‌శ‌కంలో వ‌చ్చిన పెద్ద హిట్ల‌లో అది ఒక‌టి. ఇలా పాత టైటిళ్ల‌ను మన వాళ్లే మ‌ళ్లీ మ‌ళ్లీ వాడుతుంటారు కానీ.. వార‌సుడు జోలికి ఎవ‌రూ వెళ్ల‌లేదు. ఇప్పుడు విజ‌య్ సినిమాకు ఆ టైటిల్ వాడేశారు వంశీ పైడిప‌ల్లి, దిల్ రాజు.