కేజీఎఫ్ మేం తీసుంటే చంపేసేవాళ్లు-క‌ర‌ణ్ జోహార్

సౌత్ సినిమా జెండా నార్త్‌లో రెప‌రెప‌లాడ‌టానికి ప‌రోక్షంగా బాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కూడా ఒక కార‌ణం. బాహుబ‌లి సినిమాను హిందీలో త‌న బేన‌ర్ ద్వారా క‌ర‌ణ్ రిలీజ్ చేయ‌డం వ‌ల్లే దానికంత రీచ్ వ‌చ్చింది. ఆ సినిమాను చాలా అగ్రెసివ్‌గా ప్ర‌మోట్ చేయ‌డం, దానికి బాలీవుడ్ సెల‌బ్రెటీల మ‌ద్ద‌తు ద‌క్కేలా చూడ‌డంలో క‌రణ్ పాత్ర కీల‌కం.

ఐతే బాహుబ‌లి బాలీవుడ్ మార్కెట్ మీద ప‌రోక్షంగా ప్ర‌తికూల ప్ర‌భావం చూపింది. జ‌నాలు సౌత్ సినిమాల‌కు రుచి మ‌రిగారు. కేజీఎఫ్‌, పుష్ప లాంటి చిత్రాల‌తో ఈ ఒర‌వ‌డి బాగా పెరిగి బాలీవుడ్ సినిమాల అస్తిత్వ‌మే ప్ర‌మాదంలో ప‌డింది. ఈ విష‌యంలో క‌ర‌ణ్ జోహార్‌ను నిందించేవాళ్లు కూడా ఉన్నారు బాలీవుడ్లో. ఐతే క‌ర‌ణ్ మాత్రం అప్పుడు, ఇప్పుడు సౌత్ సినిమాల‌ను పొగుడుతూనే ఉన్నాడు. సౌత్ చిత్రాల‌ను చూసి నేర్చుకోవాల‌ని, సినిమాలు తీసే విష‌యంలో బాలీవుడ్ ఫిలిం మేక‌ర్స్ పున‌రాలోచించాల‌ని కూడా అత‌ను సూచిస్తుంటాడు.

తాజాగా క‌ర‌ణ్ జోహార్ ఉత్త‌రాదిన‌ సౌత్ సినిమాల జోరు గురించి మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. క‌థ‌ల‌ను ఎంచుకోవ‌డంలో, సినిమాలు తీయ‌డంలో ద‌క్షిణాది ద‌ర్శ‌కులకు ఉన్న క‌న్విక్ష‌న్ గొప్ప‌ద‌ని, అది బాలీవుడ్ ఫిలిం మేక‌ర్స్‌లో లోపిస్తున్న‌ట్లుగా అనిపిస్తోందని క‌ర‌ణ్ వ్యాఖ్యానించాడు. ఒకే సినిమాలో చాలా చెప్పాల‌నుకుని త‌మ ద‌ర్శ‌కులు క‌న్ఫ్యూజ్ అవుతుంటార‌ని.. కానీ ద‌క్షిణాది డైరెక్ట‌ర్లు తాము ఏం చెప్పాల‌నుకున్నామో, చూపించాల‌నుకున్నామో అది ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా చెప్ప‌డం, చూపించ‌డం ద్వారా విజ‌య‌వంతం అవుతున్నార‌ని క‌ర‌ణ్ అన్నాడు.

ఇటీవ‌ల తాను కేజీఎఫ్‌-2 చూశాన‌ని.. అది త‌న‌కు బాగా న‌చ్చింద‌ని.. కానీ అదే సినిమా బాలీవుడ్లో తీసి ఉంటే ఎన్నో ఇబ్బందులు వ‌చ్చేవ‌ని.. విమ‌ర్శ‌ల‌తో త‌మ‌ను చంపేసేవార‌ని క‌ర‌ణ్ వ్యాఖ్యానించ‌డం విశేషం. కేజీఎఫ్‌-2 హిందీలో రూ.450 కోట్ల దాకా వ‌సూళ్లు కొల్ల‌గొట్టిన సంగ‌తి తెలిసిందే.