విరాట పర్వం మూవీ ప్రమోషన్లలో భాగంగా సాయి పల్లవి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ భజరంగ్ దళ్ రంగంలో దిగింది. హైద్రాబాద్, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. అదేవిధంగా ఈ సినిమా దర్శకులు వేణు ఊడుగుల పై కూడా కేసు నమోదు చేయాలని భావిస్తోంది. విరాట పర్వం టైటిల్ కూడా అభ్యంతరంగానే ఉందని, మహాభారతంలో ఓ కీలక ఘట్టానికి సంబంధించిన పేరును, నక్సల్బరీ మూమెంట్ బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమాకు ఎలా పెడతారని ప్రశ్నిస్తూ పోలీసులను ఆశ్రయించేందుకు యోచిస్తోంది.
ఇప్పుడు ఈ రెండు వివాదాలూ సినిమా విడుదల ముందు తీవ్ర సంచలనం అవుతున్నాయి. వీటిపై మూవీ టీం ఇంతరకూ స్పందించలేదు. మరోవైపు సాయి పల్లవికి సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతోంది. ఆమె వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఏమీ లేవని అంటోంది. అసలు సోషల్ కాజ్ తో మాట్లాడే నటీనటులు చాలా తక్కువగా ఉంటున్నారని, ఈ విషయంలో సాయి పల్లవి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనన్న వాదన ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది.
దీంతో రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ గా విడిపోయి ఎప్పటిలానే వాదోపవాదాలు వినిపిస్తున్నారు. ఇక సినిమా (జూన్ 17, 2022 ) విడుదల అవుతున్న నేపథ్యంలో ఇలాంటి వివాదాలు ఏ విధంగా చిత్రాన్ని ప్రభావితం చేస్తాయో అన్న ఆసక్తి కూడా ఉంది. ఎందుకంటే ఇదొక నక్సల్బరీ నేపథ్యంలో యుద్ధ నేపథ్యంలో రాసుకున్న కథ. ఇందులో ప్రేమ ఉంది. విప్లవం ఉంది. పోరాట సంబంధ ప్రేమ కథ ఒకటి ఉంది.
ఈ కథ 1990లో పుట్టింది. ఈ కథ వరంగల్ నేపథ్యంలో తుపాకీ చప్పుళ్ల నడుమ నడుస్తోంది. యుద్ధం ఓ ప్రేమ కథకు ప్రాణం పోసింది అని చెప్పడమే ఈ కథకు ఉన్న ప్రధానోద్దేశం అని డైరెక్టర్ కమ్ రైటర్ వేణు ఊడుగుల అంటున్నారు. మార్క్సిజంను ప్రమోట్ చేసే చిత్రం ఇది కానేకాదని స్పష్టం చేస్తూ మూవీ ప్రమోషన్లలో ఆయన పూర్తి కవితాత్మక ధోరణిలో మాట్లాడుతూ, కథాంశ నేపథ్యాన్ని అతి సరళంగా వివరించే ప్రయత్నం ఒకటి చేశారు. ఎన్నో ఒడిదొడుకులు దాటుకుని వస్తున్న ఈ సినిమా కు సంబంధించి వెలువడే సానుకూల ఫలితం పై అటు దగ్గుబాటి రానాతో పాటు సాయి పల్లవితో పాటు ఇంకా ఎందరో ఔత్సాహిక చిత్ర రూపకర్తలు కోటి ఆశలతో ఉన్నారు.