ఈ వారం మరో బాక్సాఫీస్ యుద్ధానికి తెరలేస్తోంది. వందల కోట్ల బడ్జెట్ లతో తెలుగులో రూపొందిన గ్రాండియర్లు లేవు కానీ దేనికవే ప్రత్యేకత కలిగిన సినిమాలు క్లాష్ అవుతున్నాయి. ఇందులో మొదటిది నాని అంటే సుందరానికి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ ఎంటర్టైనర్ మీద ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి గురి ఉంది.
దానికి తగ్గట్టే ట్రైలర్ ఆకట్టుకునేలా కట్ చేయడంతో పాటు నాని నజ్రియా జంట ఫ్రెష్ గా ఉండటం లాంటి కారణాలు హైప్ పెరిగేందుకు ఉపయోగపడుతున్నాయి. రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ అతిథిగా రావడం సహజంగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ దృష్టిని ఇటువైపు తిప్పుతుంది. ఇక పోటీలో మిగిలిన వాటి సంగతి చూస్తే 777 ఛార్లీకి ప్రీ రిలీజ్ ప్రీమియర్ల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
మేజర్ మోడల్ ని ఫాలో అవుతూ దేశవ్యాప్తంగా వేసిన స్పెషల్ షోలకు జనం స్పందన బాగుంది. అతడే శ్రీమన్నారాయణతో పరిచయమైన రక్షిత్ శెట్టి హీరోగా కుక్కని టైటిల్ రోల్ లో చూపిస్తున్న ఈ ఎమోషనల్ డ్రామాకు తెలుగులో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
ఇవి ఒక ఎత్తయితే జురాసిక్ వరల్డ్ చివరి భాగం డామినియన్ కూడా 10నే వస్తోంది. చాలా చోట్ల ఒక రోజు ముందే సాయంత్రం నుంచి స్పెషల్ ప్రీమియర్లు వస్తున్నారు. నగరాల్లోని మల్టీప్లెక్సుల్లో దీన్నుంచి సుందరానికి, ఛార్లీకి టఫ్ కాంపిటీషనే ఉంటుంది. వసూళ్లను తీవ్రంగా ప్రభావితం చేసినా చేయకపోయినా వేసవి సెలవులు కాబట్టి పిల్లలుండే కుటుంబాలు డైనోసర్లను చూసేందుకే ప్రాధాన్యం ఇవ్వొచ్చు. మొత్తానికి కుక్క రాకాసి బల్లుల మధ్య వెరైటీ పోటీ అందుకున్న సుందరం జాతకం ఎల్లుండి తేలిపోతుంది