అధిక టికెట్ ధరలు ప్రేక్షకులపై తీవ్ర ప్రభావమే చూపుతున్నాయని.. చాలామంది థియేటర్లకు రావడం తగ్గించేస్తున్నారని, దీని వల్ల థియేటర్ల ఉనికే ప్రమాదంలో పడబోతోందని టాలీవుడ్ పెద్దలు అర్థం చేసుకున్నట్లే కనిపిస్తోంది. ఇటీవల ఎఫ్-3 సినిమాకు అదనంగా రేట్లు పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ దిల్ రాజు ఛాన్స్ తీసుకోలేదు. ఆ సినిమాకు సాధారణ రేట్లే ఉంటాయని ప్రకటించారు. కానీ సాధారణ స్థాయిలో కూడా రేట్ల భారం ఎక్కువే ఉందని.. ప్రస్తుతం ఉన్న రేట్లను ఇంకా తగ్గిస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మేజర్ సినిమాకు మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరను రూ.195కి, సింగిల్ స్క్రీన్ల రేట్లు రూ.150కి పరిమితం చేయడం మంచి ఫలితాన్నే ఇస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రేట్ల తగ్గింపు విషయంలో ఇంకా చొరవ తీసుకున్నారు. తన నిర్మాణంలో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలకు టికెట్ల ధరలు ఇంకా తగ్గించాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్ర నిర్మాణ భాగస్వామి, అరవింద్ నిర్మాణ సంస్థలో అన్నీ తానై వ్యవహరించే బన్నీ వాసు పక్కా కమర్షియల్ ప్రెస్ మీట్ సందర్భంగా తమ సినిమాకు పెట్టబోయే టికెట్ల రేట్ల గురించి స్పష్టమైన ప్రకటన చేశాడు.
తెలంగాణలో జీఎస్టీతో కలిపితే మల్టీప్లెక్సుల్లో రూ.189, సింగిల్ స్క్రీన్లలో రూ.112 రేటు ఉండబోతోంది ఈ సినిమాకు. ఏపీలో ఈ రేట్లు వరుసగా రూ.177, రూ.112 ఉండబోతున్నాయి. సింగిల్ స్క్రీన్ల ధరను రూ.112 పెట్టడం కచ్చితంగా సినిమాకు కలిసొచ్చేదే. ఈ రేటుతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కచ్చితంగా పెరుగుతుంది. ఇక ఈ చిత్రాన్ని ఓటీటీలోకి ఎప్పుడు తెచ్చే విషయం మీదా బన్నీ వాసు క్లారిటీ ఇచ్చాడు. ఐదు వారాల్లోపు పక్కా కమర్షియల్ ఓటీటీలో రాదని అతను స్పష్టం చేశాడు.