టెనెట్.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా విడుదల కోసం చూస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ అనదగ్గ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. కరోనా ప్రభావం లేకుంటే ఎప్పుడో ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ రిలీజ్‌కు అంతా రెడీ చేసుకునే సమయానికి వైరస్ ప్రభావం మొదలై ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు షట్‌డౌన్ అయ్యాయి.
నోలన్ సినిమా ఎన్నో దేశాల్లో ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. వేల కోట్ల ఆదాయం వస్తుంది. కాబట్టి అన్ని దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఎదురు చూడాల్సింది. అమెరికా సహా చాలా దేశాలు కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో జులై నెలాఖరుకు పరిస్థితులంతా చక్కబడతాయనుకుని ఆ నెల 31న ‘టెనెట్’ను రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. ఆ సినిమాతో వరల్డ్ సినిమా రీస్టార్ట్ అవుతుందని అంతా అనుకున్నారు.
కానీ ఇండియా సహా చాలా దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇంకా కొన్ని నెలల పాటు పరిస్థితులు చక్కబడేలా లేవు. దీంతో ‘టెనెట్’ రిలీజ్ డేట్‌ను మరోసారి మార్చక తప్పలేదు. జులై 31 నుంచి ఆగస్టు 12కు కొత్త డేట్ ఇచ్చారు. కానీ ఆ కొన్ని రోజుల్లో పరిస్థితులు చక్కబడతాయని ఎవరూ అనుకోవడం లేదు. మరోసారి డేట్ మార్చడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు.
నోలన్ సినిమాలకు వందల కోట్ల ఆదాయం వచ్చే చాలా దేశాల్లో కనీసం ఇంకో మూడు నెలలు థియేటర్లు పున:ప్రారంభం అయ్యే పరిస్థితి లేదు. ఆ తర్వాత థియేటర్లు తెరుచుకున్న సాధారణ స్థాయిలో నడవకపోవచ్చు. కాబట్టి ఈ ఏడాది ‘టెనెట్’ సినిమాను రిలీజ్ చేయకపోవడం మంచిదని.. వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేయడం బెటర్ అని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి నోలన్ టీం ఆ నిర్ణయానికే వచ్చినా ఆశ్చర్యం లేదేమో.