తమన్నా భాటియా.. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఒక దశాబ్దానికి పైగా టాప్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన కథానాయిక. తెలుగులో శ్రీ అనే ఫ్లాప్ మూవీతో కథానాయికగా పరిచయం అయినప్పటికీ.. ఆ తర్వాత హ్యాపీడేస్‌తో ఆమె దశ తిరిగిపోయింది. ఆపై టాలీవుడ్ టాప్ హీరోలందరితో ఆమె సినిమాలు చేసింది. అందులో ఎన్నో బ్లాక్‌బస్టర్లున్నాయి. తమిళంలో సైతం అగ్ర కథానాయకులతో చాలా సినిమాలే చేసింది. ఐతే ఎంత హవా సాగించిన హీరోయిన్‌కైనా ఒక దశ దాటాక క్రేజ్ పడిపోతుంది. అవకాశాలు తగ్గిపోతాయి.
తమన్నా కూడా అందుకు మినహాయింపు కాదు. ఇప్పటికీ గ్లామర్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ.. సినిమాలైతే చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు మిల్కీ బ్యూటీకి. మూడేళ్ల ముందు ఎఫ్-2 సినిమాతో పెద్ద హిట్ కొట్టాక కథానాయికగా తమన్నాకు మరో సక్సెస్ లేదు. అవకాశాలు ఆగిపోలేదు కానీ.. సక్సెస్‌లు అయితే లేవు. దీంతో తన స్థాయికి తగని సినిమాల్లో కూడా నటించాల్సి వస్తోంది.
ఐటెం సాంగ్స్‌కు కూడా ఓకే అనేస్తోంది. ఇలాంటి టైంలో ఎఫ్-2 సీక్వెల్ ఎఫ్-3తో మళ్లీ తమన్నాకు జనాల నోళ్లలో నానే అవకాశం వచ్చింది. విడుదలకు ముందే హిట్ కళ కనిపించిన ఈ చిత్రం.. డివైడ్ టాక్‌ను తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది. వీకెండ్లో ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రంలో ఇంకో ఇద్దరు హీరోయిన్లున్నప్పటికీ తమన్నానే ప్రధాన ఆకర్షణ. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వేరు.
ఇంత పెద్ద సినిమాలో నటించి, ఆ సినిమా జనాదరణ పొందుతున్నపుడు ప్రమోషన్లలో భాగం కావడం సినిమా కంటే కూడా తమన్నాకు అవసరం. కానీ ఈ సినిమాలో తనకు ప్రాధాన్యం తగ్గడమో, మరో కారణంతోనో ఆమె ప్రమోషన్లకు దూరం అయిపోయింది.
దీంతో అందరూ ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు ప్రేక్షకులు తన గురించి నెగెటివ్‌గా మాట్లాడుకుంటున్నారు. చాన్నాళ్ల తర్వాత ఓ పెద్ద సినిమాలో సందడి చేసిన తమన్నా.. ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండడం ద్వారా కెరీర్‌ను దెబ్బ తీసుకుందనే చెప్పాలి. అసలే అంతంతమాత్రంగా నడుస్తున్న బండికి బ్రేకులు పడటం గ్యారెంటీ అనిపిస్తోంది.