కలెక్షన్లకు కాస్త ఊపు తీసుకొద్దామని సర్కారు వారి పాటలో మురారివా పాటను జోడిస్తున్నారు కానీ అది మరీ అద్భుతాలు చేసే సీన్ ఉండకపోవచ్చు. దీని సంగతి పక్కనపెడితే కొన్ని ప్రధాన కేంద్రాలు మినహాయిస్తే ఇప్పుడీ మూవీ ఫైనల్ రన్ కు దగ్గరగా వచ్చేసింది. చాలా చోట్ల వసూళ్లు పడిపోయాయి. రెండు వారాలు మంచి జోష్ తో హడావిడి కనిపించినప్పటికీ థర్డ్ వీక్ నుంచి మైత్రి సైతం పబ్లిసిటీ దూకుడు తగ్గించేసింది. మేజర్, విక్రమ్, సామ్రాట్ పృథ్విరాజ్ లాంటి కొత్త చిత్రాలు వస్తుండటంతో ఇంతకన్నా ఆశించలేం.
ఇప్పుడందరి చూపు సర్కారు వారి పాట ఓటిటి ప్రీమియర్ మీద ఉంది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ మొదలుపెట్టేశారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉందండోయ్. కొద్దిరోజుల పాటు రెంటల్ పద్ధతిలో అదేనండి పే పర్ వ్యూ మోడల్ లో అందుబాటులో ఉంచారు. కెజిఎఫ్ చాఫ్టర్ 2కి ఇలాగే చేసిన సంగతి తెలిసిందే. 199 రూపాయలు కట్టేసి రెండు రోజుల్లో చూడాలనే కండీషన్ మీద సోషల్ మీడియాలో నెటిజెన్లు భగ్గుమన్నప్పటికీ ప్రైమ్ అదేమీ పట్టించుకోలేదు. దీనికి కూడా అదే కొనసాగిస్తున్నారు.
మహేష్ సినిమా క్రేజ్ కాబట్టి ఎందరు డబ్బులు కట్టి చూస్తారో మరి. దీని తర్వాత ప్రైమ్ సభ్యులకు ఫ్రీ స్ట్రీమింగ్ జూలై మొదటి వారం నుంచి ఉండొచ్చు. ఇప్పుడీ రిలీజ్ కి ప్రత్యేకంగా పబ్లిసిటీ గట్రా చేయకుండా సైలెంట్ గా వదలడం గమనార్హం. ఎక్స్ ట్రా డబ్బులు తీసుకోని కారణంగానే ఆర్ఆర్ఆర్ నెట్ ఫ్లిక్స్, జీ5లో వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తోంది. ఏది ఏమైనా ఈ రెంటల్ మోడల్ ని భారతీయులకు అలవాటు చేయడానికి ప్రైమ్ ఫిక్స్ అయిపోయింది. మిగిలిన ఓటిటిలు కూడా ఇదే ఫాలో అయితే జేబుకు చిల్లులే.