కమల్ శేష్ మధ్యలో నలిగిపోతున్నాడు

రేపు విడుదల కాబోతున్న మూడు ప్యాన్ ఇండియా సినిమాల్లో మేజర్, విక్రమ్ ల డామినేషన్ కొనసాగుతుండగా సామ్రాట్ పృథ్విరాజ్ వీటి మధ్య నలిగిపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న సాయంత్రానికే విక్రమ్ 5 కోట్ల మార్క్ ని దాటేయగా మేజర్ 2 కోట్లకు దగ్గరగా ఉంది. పృథ్విరాజ్ మాత్రం కోటిన్నరకే నానా తిప్పలు పడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ ట్రెండ్ ని చూసి విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. యష్ లాంటి పెద్ద బ్యానర్ నుంచి వస్తున్న మూవీకి ఇలాంటి రెస్పాన్స్ అనూహ్యమే.

అక్షయ్ కుమార్ అంతటి స్టార్ హీరోకి ఈ పరిస్థితి రావడం విచిత్రం. అందులోనూ చరిత్ర గొప్పగా చెప్పుకునే ఓ వీరుడి గాథను హిందూ సెంటిమెంట్ దట్టించి మరీ ప్రమోట్ చేస్తే దానికి తగ్గ ఫలితం కనిపించడం లేదు. ఆఖరికి బిజెపిని రంగంలోకి దించి అమిత్ షా తదితర ప్రముఖులకు ప్రీమియర్ షోలు వేసి వాళ్ళతో గొప్పగా మాట్లాడిస్తున్నా ఆ ప్రభావం టికెట్ల అమ్మకాల మీద లేదనే చెప్పాలి. ఈ లెక్కన ముందస్తుగా అంచనా వేసుకున్న మొదటి రోజు కలెక్షన్ 12 కోట్లలో సగం వచ్చినా గొప్పే అనేలా ఉన్నాయి పరిణామాలు.

మేజర్ ముంబై లాంటి నగరాల్లోనూ దూసుకుపోతోంది. ప్రీ రిలీజ్ ప్రీమియర్లు బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇచ్చాయి. బాగుందనే టాక్ వస్తే చాలు ఉరి, ది కాశ్మీర్ ఫైల్స్ తరహాలో సంచలనం నమోదు చేయడం ఖాయమని అర్థమవుతోంది. దీని స్థాయిలో విక్రమ్ దూకుడు లేకపోయినా తమిళనాడు కేరళలో మాత్రం అదరగొడుతోంది. చాలా కాలం తర్వాత కమల్ ని పవర్ ఫుల్ క్యారెక్టర్ లో చూడనుండటంతో అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. మరి సామ్రాట్ పృథ్విరాజ్ కనీసం యావరేజ్ టాక్ తో అయినా బయటపడతాడా చూడాలి.