రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న లైగర్ ఆగస్ట్ 25 విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఇప్పటి నుంచే ప్రమోషన్ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నారు. హీరోయిన్ అనన్య పాండేతో కలిసి విజయ్ నిన్న కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో పాల్గొనడం ద్వారా దీనికి శ్రీకారం చుట్టాడు.
నిజానికి ఈ షో ఆపేస్తున్నట్టు కరణ్ ఈమధ్యే ప్రకటించాడు. బహుశా ఇది చివరి సిరీస్ లో వచ్చే ఎపిసోడ్ కావొచ్చు. ఈ ప్రాజెక్టులో తానూ ఒక నిర్మాణ భాగస్వామి కాబట్టి అందులో భాగంగా ఇది చేసిండొచ్చు. లైగర్ కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ తో పాటు బాక్సింగ్ నేర్చుకున్నాడు. నెలల తరబడి కఠిన శిక్షణ అందుకున్నాడు.
హిందీలో మొదటిసారి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్న మూవీ కావడంతో దానికి తగ్గట్టే అక్కడ తన బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. దానికి కరణ్ జోహార్ ఇస్తున్న చేయూత చాలా ఉంది. అందుకే విజయ్ కూడా వీలైనంత ఎక్కువగా ముంబైలో ఉంటున్నాడు.
లైగర్ బ్లాక్ బస్టర్ కావడం పూరికి దేవరకొండకి ఇద్దరికీ చాలా అవసరం. క్రేజ్ తగ్గనప్పటికీ డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ ఫలితాలు విజయ్ దేవరకొండ మార్కెట్ ని, కామన్ ఆడియన్స్ లో అతని ఇమేజ్ ని ప్రభావితం చేసిన మాట వాస్తవం. ఇప్పుడా డ్యామేజ్ ని లైగర్ పూర్తిగా తీరుస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఇప్పటికే బోలెడు వచ్చేసిన తరుణంలో లైగర్ ఏ విధంగా ప్రత్యేకంగా నిలవనున్నాడో చూడాలి. ప్రపంచప్రసిద్ధ మైక్ టైసన్ మొదటిసారి ఫుల్ లెన్త్ రోల్ చేస్తున్న ఇండియన్ మూవీ ఇదే.
Gulte Telugu Telugu Political and Movie News Updates