F3.. ఇప్పటికి ఓకే కానీ..

భారీ అంచనాలు.. అదే సమయంలో అనేక సందేహాల మధ్య ఈ వీకెండ్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ఎఫ్-3’ సినిమా. ‘ఎఫ్-2’కు కొనసాగింపుగా తీసిన సినిమా కావడం వల్ల దీనిపై భారీ అంచనాలు నెలకొనగా.. ఇప్పుడు టికెట్ల ధరలు పెరిగిపోవడానికి తోడు వేరే కారణాల వల్ల ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూసే విషయంలో చాలా సెలెక్టివ్‌గా తయారవడం, పైగా ‘ఎఫ్-3’ మీద మోయలేనంత బిజినెస్ భారం ఉండటం ఈ సినిమా సక్సెస్ మీద సందేహాలు నెలకొన్నాయి.

ఐతే సినిమాకు తొలి రోజు అంతా సానుకూలంగా జరిగింది. చాలా వరకు రివ్యూలు.. అలాగే మౌత్ టాక్ పాజిటివ్‌గా వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ముందు ఆశించిన స్థాయిలో లేకపోయినా రిలీజ్ దగ్గర పడేసరికి పరిస్థితి మెరుగుపడింది. తొలి రోజు మంచి ఆక్యుపెన్సీతోనే నడిచింది ‘ఎఫ్-3’. డే-1 షేర్ కూడా రూ.9 కోట్లకు పైగా రావడం శుభసూచకం. ఇక రెండో రోజు వసూళ్లలో పెద్దగా డ్రాప్ కూడాా కనిపించలేదు.

తొలి రోజుకు దీటుగా రూ.రూ.8.5 కోట్ల మేర షేర్ వచ్చింది. రెండో రోజు మామూలుగా కొత్త సినిమాలకు కనిపించేంత డ్రాప్ ఈ సినిమాకు లేదు. ఓవరాల్‌గా రెండు రోజుల షేర్ రూ.18 కోట్లకు చేరువగా ఉంది. ఆదివారం కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగాయి. సినిమా ఈ రోజంతా హౌస్ ఫుల్స్‌తో నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. తొలి రెండు రోజులతో సమానంగా మూడో రోజు షేర్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

మొత్తంగా వీకెండ్ షేర్ రూ.25 కోట్లు దాటే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా రేంజికి ఇవి మంచి వసూళ్లే. కానీ ‘ఎఫ్-3’ వీకెండ్ వరకు జోరు చూపిస్తే సరిపోదు. దీనికి లాంగ్ రన్ అవసరం. రెండు వారాలైనా నిలకడగా వసూళ్లు రాబడితే తప్ప బయ్యర్లు బయటపడే పరిస్థితి లేదు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.80 కోట్లు పలకడం గమనార్హం.

అంటే వీకెండ్ రికవరీ మూడింట ఒక వంతే ఉండబోతోంది. దీని మీద ఇంకో రెండు రెట్లు షేర్ రాబడితే తప్ప బయ్యర్లు సేఫ్ జోన్లోకి రాలేరు. అందుకోసం సినిమా రన్ మూడో వీకెండ్ వరకు కొనసాగాలి. కానీ వీకెండ్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఏ మేర థియేటర్లకు వస్తారు.. వీక్ డేస్‌లోసినిమా ఎంత మాత్రం నిలబడుతుంది అన్నది ప్రశ్న. వచ్చే వారం మేజర్, విక్రమ్ మంచి అంచనాల మధ్య రిలీజవుతున్న నేపథ్యంలో వాటి పోటీని తట్టుకుని ‘ఎఫ్-3’ బయ్యర్లను ఎలా బయట పడేస్తుందో మరి.