నిర్మాత‌గా నాగ‌బాబు రీఎంట్రీ

ఇప్పుడంటే న‌టుడిగా, టెలివిజ‌న్ హోస్ట్‌గా చాలా బిజీగా ఉన్నాడు కానీ.. ఒక‌ప్పుడు మాత్రం నాగ‌బాబు అంటే నిర్మాతగానే అంద‌రికీ ప‌రిచ‌యం. త‌న త‌ల్లి అంజ‌నా దేవి పేరు మీద అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్ పెట్టి రుద్ర‌వీణ‌, త్రినేత్రుడు, ముగ్గురు మొన‌గాళ్లు, బావ‌గారు బాగున్నారా, గుడుంబా శంక‌ర్, స్టాలిన్, ఆరెంజ్ లాంటి భారీ చిత్రాల‌త‌ను నిర్మించాడు నాగ‌బాబు.

చిరంజీవితో చేసిన సినిమాల్లో కొన్ని మంచి ఫలితాన్నిచ్చాయి. కొన్ని దెబ్బ కొట్టాయి. అయినా నిల‌దొక్కుకున్నాడు కానీ.. రామ్ చ‌ర‌ణ్‌ను పెట్టి పెద్ద బ‌డ్జెట్లో తీసిన ఆరెంజ్ ఫ‌లితం తిర‌గ‌బ‌డ‌డంతో నాగబాబు కోలుకోలేక‌పోయాడు. ఆ దెబ్బ‌కు అప్పుల పాలైపోయి.. సినిమాల నిర్మాణానికి దూర‌మైపోయాడు. మ‌ధ్య‌లో నాగ‌బాబుకు స‌పోర్ట్ ఇవ్వ‌డానికి అల్లు అర్జున్.. త‌న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో భాగ‌స్వామిని చేశాడు కానీ.. అది కూడా ఆయ‌న్ని తీవ్ర నిరాశ‌కే గురి చేసింది.

అప్ప‌ట్నుంచి అస‌లే ప్రొడ‌క్ష‌న్ జోలికి వెళ్ల‌ట్లేదు నాగ‌బాబు. చేతిలో వ‌రుణ్ తేజ్ లాంటి మీడియం రేంజ్ హీరో ఉన్నా.. ఆయ‌న నిర్మాత‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌ట్లేదు. కానీ త‌న తండ్రిని వ‌రుణ్ మ‌ళ్లీ నిర్మాణంలోకి తీసుకొస్తున్నాడు. అది త‌న సినిమాతోనే కావ‌డం విశేషం. శుక్ర‌వారం ఎఫ్‌-3తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న వ‌రుణ్‌.. దీని త‌ర్వాత ప్ర‌వీణ్ స‌త్తారుతో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. జులై నుంచి ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ల‌నుంది.

ఈ చిత్రాన్ని వ‌రుణ్‌తో తొలి ప్రేమ తీసిన సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించ‌నున్నారు. ఇందులో నాగ‌బాబు కూడా భాగ‌స్వామిగా మార‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని వ‌రుణే స్వ‌యంగా వెల్ల‌డించాడు. కొంచెం పెద్ద బ‌డ్జెట్లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా 70 రోజుల పాటు యుఎస్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోబోతోంది. మ‌రి ఈ సినిమాతో అయినా నాగ‌బాబు నిర్మాత‌గా మ‌ళ్లీ స‌క్సెస్ చూస్తాడేమో చూడాలి.