నిఖిల్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు

యువ కథానాయకుడు నిఖిల్ కెరీర్ ఇప్పుడంత ఊపులో ఏమీ లేదు. కొవిడ్ కారణంగా అతడి కెరీర్లో బాగా గ్యాప్ వచ్చేసింది. అంతకుముందు ‘అర్జున్ సురవరం’ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. మిగతా సినిమాలన్నీ తుస్సుమనిపించాయి. అయినా సరే.. నిఖిల్‌కు అవకాశాల విషయంలో ఏమీ ఢోకా లేదు. క్రేజీ ప్రాజెక్టులతో వరుసగా బాక్సాఫీస్ మీద ఎటాక్ చేయడానికి అతను సిద్ధమవుతున్నాడు.

సుకుమార్ కథతో ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ రూపొందించిన ‘18 పేజెస్’తో అతను మళ్లీ థియేటర్లలోకి అడుగు పెట్టబోతున్నాడు. జూన్‌లోనే ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. అది రిలీజైన నెల రోజుల్లోపే ‘కార్తికేయ-2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నిఖిల్. యువ దర్శకుడు చందు మొండేటితో నిఖిల్ చేసిన ‘కార్తికేయ’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. నిఖిల్ కెరీర్లో ఏ రకంగా చూసినా అది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు.

అప్పట్లో అది అతడికి హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అంత పెద్ద హిట్ సినిమాకు సీక్వెల్ కావడంతో ‘కార్తికేయ-2’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమాకు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లాంటి పెద్ద నిర్మాతలు దొరకడంతో బడ్జెట్ కూడా బాగానే పెట్టారు. సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఐతే పాన్ ఇండియా రిలీజ్ అంటే ఏదో నామమాత్రంగా కాకుండా పకడ్బందీగానే చేస్తున్నారు.

ఈ సినిమా ఎక్కువగా ఉత్తరాదినే షూటింగ్ జరుపుకోవడం విశేషం. కొంతమేర విదేశాల్లో కూడా చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో నిఖిల్ స్వయంగా హిందీలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం విశేషం. ‘హైదరాబాద్ నవాబ్స్’ లాంటి సినిమాల్లో నిఖిల్ హిందీలోనే డైలాగులు చెప్పాడు. అతడికి హిందీపై బాగానే పట్టుంది. ‘కార్తికేయ-2’ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండటంతో స్వయంగా డబ్బింగ్ చెప్పాడు. ‘కశ్మీర్ ఫైల్స్’తో ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయం అయిన అభిషేక్ అగర్వాల్ పెద్ద రేంజిలో సినిమాను నార్త్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టే అవకాశాలున్నాయి.