ఆగని ‘ఆచార్య’ పోస్టుమార్టం

ఆచార్య రిలీజై నాలుగు వారాలు కావస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఇంతగా నిరాశ పరిచిన చిత్రాలు అరుదనే చెప్పాలి. ఆయన కెరీర్లో గతంలో డిజాస్టర్లు లేక కాదు కానీ.. వాటిలో కూడా చిరంజీవి వరకు బాగా హైలైట్ అయ్యేవాడు. అభిమానులను అలరించేవాడు. కానీ ‘ఆచార్య’లో ఆ ఆనందం కూడా ఇవ్వలేదు. చిరంజీవి ఇంత నీరసంగా, నామమాత్రంగా కనిపించిన సినిమాలు అరుదు. ఆయనలోని ఎనర్జీని కొరటాల ఏమాత్రం వాడుకోలేకపోయాడన్నది పెద్ద కంప్లైంట్.

ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ టైంలో వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. స్వయంగా చిరు అభిమానులు సినిమా లోపాల పుట్ట అంటూ ఇందులోని మైనస్‌ల గురించి సుదీర్ఘ విశ్లేషణలు చేశారు. కొన్ని రోజుల పాటు ఈ ఆక్రందనలు  కొనసాగాయి. ఐతే సినిమా రెండో వారంలోకి అడుగు పెట్టేసరికే థియేట్రికల్ రన్ ముగిసిపోవడంతో అందరూ సైలెంటైపోయారు. కానీ ఇప్పుడు అమేజాన్ ప్రైమ్ ద్వారా సినిమా డిజిటల్లో రిలీజైన నేపథ్యంలో మళ్లీ పోస్టుమార్టం మొదలైంది.

‘ఆచార్య’ మీద బోలెడన్ని కౌంటర్లు, మీమ్స్‌తో నెటిజన్లు మళ్లీ పోస్టు మార్టం జరుపుతున్నారు. ఈ సినిమాలో పాదఘట్టం అనే పదాన్ని తెగ ఊదరగొట్టేయడం  గురించి బోలెడన్ని మీమ్స్ కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. ఆ మీమ్స్ చూస్తే.. సినిమాలో పాదఘట్టం అనే పదాన్ని అన్నిసార్లు వాడారా అని షాకవ్వాల్సిందే. ఇక సిద్ధ చనిపోయిన బాధలో ధర్మస్థలికి వచ్చే చిరు.. కాసేపటికే ఐటెం సాంగ్‌లో చిందేయడం గురించి, ధర్మం గురించి పెద్ద లెక్చర్ ఇచ్చిన సిద్ధ వెంటనే హీరోయిన్ స్నానం చేస్తుంటే చూడటం గురించి.. కౌంటర్లు వేస్తూ మీమ్స్ పడుతున్నాయి.

దర్శకుడు కొరటాల మీద, సంగీత దర్శకుడు మణిశర్మ మీద అయితే విమర్శలు మామూలుగా లేవు. ఆరంభ సన్నివేశాలతోనే కొరటాల నీరసం నింపేశాడని.. చిరు, చరణ్‌లను ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయాడని.. బూజుపట్టిన కమ్యూనిజం భావజాలంతో సినిమాను చెడగొట్టాడని ఆయన్ని తిట్టిపోస్తున్నారు. ఇంత పెద్ద సినిమాకు ఛాన్సిస్తే.. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమాను చంపేశాడని.. మంచి ఊపున్న పాట ఒక్కటీ ఇవ్వలేదని మణిశర్మను కూడా నెటిజన్లు బాగానే టార్గెట్ చేస్తున్నారు. స్వయంగా చిరు అభిమానులే ఆవేదనతో ఈ సినిమా మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండటం గమనార్హం.