సోషల్ మీడియాలో ఎప్పుడూ ఇరు వర్గాల అభిమానుల మధ్య ఏదో ఒక ఫ్యాన్ వార్ జరుగుతూనే ఉంటుంది. కాంపిటీషన్ ఉన్న హీరోల అభిమానుల మధ్య గొడవలు జరగడం సహజమే కానీ ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల అభిమానులు గొడవ పడితే చూసే వారికి చిరాకుగా ఉంటుంది. తాజాగా ఇలాంటి ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల ఫ్యాన్ వార్ మూవీ లవర్స్ ని ఇబ్బంది పెట్టి అసలెందుకు ఇదంతా ? అవసరమా ? అనుకునేలా చేసింది.
విషయంలోకెళ్తే మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలున్నారు. ఏ ఫంక్షన్ అయినా అందరూ కలిసి ఫోటోలకు ఫోజులిస్తారు. ఆ ఫోటోలు బయటికి రాగానే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా సంతోషపడిపోతుంటారు. అయితే ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు మెగా అభిమానుల్లో కూడా భేదాలు ఏర్పడుతున్నాయి. మెగా ఫ్యాన్స్ ఒక వైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరో వైపు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.
అప్పుడెప్పుడో పవన్ ఫ్యాన్స్ సినిమా ఫంక్షన్ లో అరిచి గోల చేస్తుంటే బన్నీ పవన్ గురించి చెప్పను బ్రదర్ అనేశాడు. అయితే ఈ మాటని కొందరు మెగా ఫ్యాన్స్ భూతద్దంలో చూసి బన్నీని అప్పటి నుండి సెపరేట్ గా చూడటం మొదలు పెట్టారు. నిజానికి ఆ ఇన్సిడెంట్ తర్వాత పవన్ ని బన్నీ రెండు మూడు సార్లు కలిసి మాట్లాడాడు. వారిద్దరి మధ్య ఎప్పటిలానే బాండింగ్ కొనసాగింది. ఇక ఆ తర్వాత ఓ సందర్భంలో అల్లు అర్జున్ తన అభిమానులను ఉద్దేశిస్తూ అందరికీ అభిమానులుంటే నాకు ఆర్మీ ఉంది అంటూ చెప్పుకున్నాడు. దాన్ని కూడా కొందరు మెగా ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకొని మెగా ఫ్యాన్స్ ని సెపరేట్ చేస్తూ అల్లు అర్జున్ మాట్లాడాడని అనుకున్నారు. నిజానికి బన్నీ వేదికపై చెప్పిన ఈ రెండు మాటలు మరో కోణంలో చూసి కొందరు మెగా ఫ్యాన్స్ హార్టయ్యారు. అక్కడి నుండి సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని మెగా ఫ్యాన్స్ తిట్టడం , మెగా ఫ్యాన్స్ ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తిట్టుకోవడం చేస్తూనే ఉన్నారు.
తాజాగా మరోసారి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ లో చిచ్చు రేగింది. ఇటివలే విజయవాడలో మెగా అభిమానులు ఓ మీటింగ్ పెట్టుకొని కొన్ని విషయాలు చర్చించుకున్నారు. పొలిటికల్ పరంగా పవన్ కళ్యాణ్ కి తమ సపోర్ట్ అందించాలని సైనికుల్లా అండగా నిలబడాలని ఏదో మోటో అనుకున్నారు. అక్కడి వరకూ బాగానే ఉంది కానీ ఆ మీటింగ్ కి పెట్టిన ఫ్లెక్స్ లో కేవలం చిరంజీవి , పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , నాగబాబు ఫోటోలో మాత్రమే పెట్టుకున్నారు. ఇక మీటింగ్ లో అఖిల భారత చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షుడు భవాని రవి కుమార్ చెప్పను బ్రదర్ గురించి చెప్పాలి అంటూ బన్నీ అప్పట్లో అన్న మాటలను గుర్తుచేస్తూ చెప్పను బ్రదర్ , మాట్లాడను బ్రదర్ అన్న బ్రదర్ ని మనం ఎందుకు మోయాలి ” అంటూ కామెంట్ చేశాడు. ఆ వీడియో క్లిప్ బన్నీ ఫ్యాన్స్ చేతికి చిక్కడంతో ఉదయం నుండే మెగా ఫ్యాన్స్ మీద సోషల్ మీడియాలో ఓ హ్యాష్ ట్యాగ్ తో ఎటాక్ చేశారు. దీంతో ఉదయం నుండి రాత్రి వరకూ మెగా వర్సెస్ అల్లు ఆర్మీ అన్నట్టుగా గట్టి వార్ జరిగింది.
బన్నీ ఫ్యాన్స్ భారీ స్థాయిలో ఎటాక్ చేయడంతో మీటింగ్ లో అల్లు అర్జున్ ని కామెంట్ చేసిన సదరు మెగా అభిమాని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పుకున్నాడు. అంతే కాదు తను చేసిన ఈ కామెంట్ పై మెగా స్టార్ చిరంజీవి గారు , రామ్ చరణ్ గారు చాలా కోపంగా ఉన్నారని తెలిసిందని అన్నాడు. మెగా ఫ్యాన్ క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసిన తర్వాత కానీ బన్నీ ఫ్యాన్స్ కోపం చల్లారలేదు.
ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ అంటే అందరూ కలిసి మెలిసి ఉండేవారు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూస్తూ ఒకరిని మరొకరి తిట్టుకుంటూ మిగతా అభిమానులకు వినోదం పంచుతున్నారు. అభిమానం అనేది సినిమా వరకే ఉండాలి కానీ ఇలా ఫ్యామిలీలో హీరోల మధ్య చిచ్చు పెట్టేలా అదీ ఒకరిని ఒకరు పర్సనల్ గా టార్గెట్ చేసేలా ఉండకూడదు. చెప్పను బ్రదర్ అంటూ బన్నీ ఆ టైంలో ఎందుకు అన్నాడో తర్వాత క్లియర్ గా చెప్పాడు దాన్ని అంతటితో వదిలేయకుండా మెగా ఫ్యాన్స్ మళ్ళీ ఇప్పుడు దాన్ని గుర్తుచేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టి వార్ పెట్టుకోవడం అవసరమా ?
అభిమానులెవరైనా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీ హీరోలంతా బాగానే ఉంటారు. కలిసినప్పుడు మాట్లాడుకుంటారు. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో సందడి చేసి కబుర్లు చెప్పుకుంటారు. కానీ అభిమానులు మాత్రం ఇలా వార్ పెట్టుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ సమయం వృధా చేసుకుంటున్నారు. ఇక ఇక్కడితో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ ముగిసి ఇకపై అన్నదమ్ముల్లా ఒకే ఫ్యామిలీ అభిమనుల్లా కలిసి మెలిసి ఉంటే బాగుంటుంది.