సినిమా ఎవరిదైనా సరే ఉదయం ప్రసాద్ ఐమ్యాక్స్ లో 8.45 షో అవ్వడం ఆలస్యం దాని జాతకం మొత్తం నెట్టింట్లో పడుతున్న ట్రెండ్ లో ఒక ప్యాన్ ఇండియా మూవీని ఏకంగా తొమ్మిది రోజుల ముందే స్క్రీనింగ్స్ వేయడం అంటే మాములు విషయం కాదు. మేజర్ టీమ్ మొట్టమొదటిసారి ఈ సాహసం చేయబోతోంది. రేపటి నుంచి అసలు రిలీజ్ డేట్ దాకా తొమ్మిది నగరాల్లో స్పెషల్ ప్రీమియర్లు వేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీన్ని బట్టి ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్థమవుతోంది.
మహేష్ బాబు మేజర్ లో నిర్మాణ భాగస్వామన్న విషయం తెలిసిందే. అందుకే హైదరాబాద్ లో ఏఎంబి మాల్ ఈ షోలకు వేదిక కానుంది. ఢిల్లీ, జైపూర్, లక్నో, అహ్మదాబాద్, ముంబై, పూణే, బెంగళూరు, కోచిలో వీటిని వేస్తున్నారు. కార్పొరేట్ మల్టీప్లెక్సులు పివిఆర్, సినీ పోలీస్, మిరాజ్, కార్నివాల్ ఈ ప్రీమియర్ల కోసం టై అప్ అయ్యాయి. వీటికి సంబంధించిన ఆన్ లైన్ బుకింగ్స్ కూడా మరికొద్ది గంటల్లో మొదలు పెట్టబోతున్నారు. సో మేజర్ మీద ఎగ్జైట్ మెంట్ ఉన్నవాళ్లు చాలా త్వరగా చూసే అవకాశం దక్కించుకోవచ్చు.
అడవి శేష్ హీరోగా మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ పాట్రియాటిక్ డ్రామాలో కోల్కతా మీద జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్స్ ని ప్రధాన అంశంగా తీసుకున్నారు. ట్రైలర్ చూశాక దర్శకుడు శశికిరణ్ తిక్కకు మంచి ప్రశంసలు దక్కాయి. జూన్ 3న విక్రమ్, పృథ్విరాజ్ లు కూడా విడుదలవుతున్నాయి. వాటిని ధీటుగా ఎదురుకోవడానికి ప్రీ పాజిటివ్ టాక్ వస్తుందన్న నమ్మకంతో మేజర్ బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇలా చేయడం ద్వారా మేజర్ అరుదైన రికార్డు అందుకున్నాడు.