బాలీవుడ్‌కు బిగ్ రిలీఫ్..


కొవిడ్ మొదలైనప్పటి నుంచి బాలీవుడ్ బాధలు మామూలుగా లేవు. ఆ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలూ దెబ్బ తిన్నాయి. సినీ రంగం కూడా అందుకు మినహాయింపు కాదు. ఐతే ఇండియాలో మిగతా ఫిలిం ఇండస్ట్రీలు బాగానే పుంజుకున్నాయి కానీ.. బాలీవుడ్ మాత్రం ఇంకా కరోనా ప్రభావాన్ని పరోక్షంగా చూస్తూనే ఉన్నాయి. గత రెండేళ్లలో ఎక్కువగా థియేటర్లు మూతపడి ఉంది నార్త్ బెల్ట్‌లోనే. దీంతో జనాలు థియేటర్లకు వచ్చే అలవాటు తగ్గిపోయింది. ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. కొవిడ్ బ్రేక్ తర్వాత వరుసగా పెద్ద సినిమాలు రిలీజవుతున్నప్పటికీ.. ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు.

సూర్యవంశీ, కశ్మీర్ ఫైల్స్ మినహాయిస్తే ఏ సినిమా ఆడలేదు. 83, రన్ వే 34, బచ్చన్ పాండే లాంటి స్టార్ల సినిమాలు, పాజిటివ్ టాక్ తెచ్చుకున్నవి కూడా అనుకున్నంతగా ఆడలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ లేక, ఓపెనింగ్స్ లేక బాలీవుడ్ అంతకంతకూ బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది.

ఓవైపు సౌత్ సినిమాలు నార్త్‌లో ఇరగాడేస్తుండగా.. హిందీ చిత్రాలు మాత్రం చతికిలపడుతుండటం పట్ల బాలీవుడ్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఐతే వారి టెన్షన్ తగ్గించడానికి ఇప్పుడో సినిమా వచ్చింది. అదే.. భూల్ భూలయియా-2. చంద్రముఖి ఆధారంగా వచ్చిన ‘భూల్ భూలయియా’కు ఇది సీక్వెల్. అనీస్ బజ్మి దర్శకత్వంలో యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ లీడ్ రోల్ చేయగా.. కియారా అద్వానీ, టబు ముఖ్య పాత్రలు పోషించారు. పెద్ద స్టార్ల సినిమాలను కూడా పట్టించుకోని హిందీ ప్రేక్షకులు ముందు నుంచి ఈ సినిమా పట్ల ఆసక్తి కనబరిచారు. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. ఈ రోజు సినిమాకు మంచి టాక్ కూడా వచ్చింది. చాన్నాళ్ల తర్వాత ఉత్తరాదిన థియేటర్లు జనాలతో కళకళలాడాయి. హార్రర్ కామెడీ సినిమాలంటే ఎలా ఉంటాయో తెలిసిందే. కథ పరంగా కొత్తదనం ఏమీ ఉండదు. కామెడీ.. హార్రర్ ఎలిమెంట్స్‌తో జనాలు కనెక్ట్ కావాలి.

‘భూల్ భూలయియా-2’ ఈ విషయంలో సక్సెస్ అయినట్లే అని చెబుతున్నారు. టాక్ బాగుంది. వసూళ్లు బాగున్నాయి. రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. మొత్తంగా బాలీవుడ్ చాన్నాళ్ల తర్వాత మంచి హిట్ చూడబోతున్నట్లు కనిపిస్తోంది. తొలి రోజు డబుల్ డిజిట్ వసూళ్లు వస్తాయని బాలీవుడ్ ఆశిస్తోంది. వంద కోట్ల సినిమా కావచ్చని దీనిపై అంచనాలున్నాయి.