శుక్రవారం వస్తోందంటే థియేటర్లు కొత్త సినిమాల కోసం ముస్తాబైపోతాయి. మామూలుగా వేసవిలో ప్రతి వీకెండ్లోనూ మంచి క్రేజున్న సినిమాలు రిలీజవుతుంటాయి. ఎందుకోగానీ ఈ శుక్రవారం మాత్రం అలాంటి సందడేమీ కనిపించడం లేదు. గత వారం సర్కారు వారి పాట లాంటి భారీ చిత్రం రిలీజవడం.. తర్వాతి వారానికి ఎఫ్-3 లాంటి క్రేజీ సీక్వెల్ షెడ్యూల్ అయి ఉండడంతో మధ్యలో రావడానికి పేరున్న చిత్రాలు భయపడినట్లున్నాయి.
రాజశేఖర్ సినిమా శేఖర్‌తో పాటు బండ్లగణేష్ మూవీ డేగల బాబ్జీ, సంపూర్ణేష్ బాబు చిత్రం దగడ్ సాంబ ఈ వారం థియేటర్లలోకి దిగబోతున్నాయి. వీటిలో శేఖర్ చెప్పుకోదగ్గ స్థాయిలో రిలీజవుతోంది కానీ.. దానికి పెద్దగా క్రేజ్ లేదు. మిగతా రెండు చిత్రాల గురించి చెప్పడానికేమీ లేదు. ఇక గత వారం రిలీజైన సర్కారు వారి పాట వీకెండ్ తర్వాత చల్లబడిపోయింది. వీక్ డేస్‌లో మరీ వీక్‌గా నడుస్తోంది. రెండో వీకెండ్లో ఏమాత్రం పుంజుకుంటుందో చూడాలి.
మొత్తంగా చూస్తే ఈ వీకెండ్లో థియేటర్లలో పెద్దగా సందడి నెలకొనే అవకాశం లేదు. ఐతే ఈ వారాంతంలో ఓటీటీల్లో మాత్రం క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత సందడి ఓటీటీల్లో ఈ వీకెండ్లో చూడబోతున్నాం. మలయాళంలో మోహన్ లాల్ దృశ్యం దర్శకుడితో చేసిన ట్వల్త్ మ్యాన్ హాట్ స్టార్ ద్వారా నేరుగా రిలీజ్ కాబోతోంది. మరోవైపు ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్ ఈ శుక్రవారమే జీ5లో మొదలు కాబోతోంది. ఐతే ఆ రోజు పడేది పెయిడ్ ప్రిమియర్సే. కొన్ని వారాలు ఇలా నడిపించి.. తర్వాత సబ్‌స్క్రైబర్లు ఫ్రీగా చూసే అవకాశం కల్పించనున్నారు.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య 20నే అమేజాన్ ప్రైమ్ ద్వారా రిలీజవుతోంది. థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఆ సినిమాను ప్రైమ్‌లో వదిలేస్తున్నారు. ఇక ఇదే రోజు శ్రీ విష్ణు లేటెస్ట్ రిలీజ్ భళా తందనాన హాట్ స్టార్‌లోకి వస్తుండగా.. హిందీ జెర్సీ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమ్ కాబోతోంది. ఆల్రెడీ కేజీఎఫ్-2 పెయిడ్ ప్రిమియర్స్‌తో ప్రైమ్‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.