డొనేట్ ఏ మీల్ : తార‌క్ ఫ్యాన్స్ అరుదైన రికార్డ్ !

తార‌క్ ఫ్యాన్స్ ఓ అరుదైన రికార్డును న‌మోదు చేశారు. ఇప్ప‌టికే టీం తార‌క్ పేరిట అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న వీరంతా ఓ ట్ర‌స్టు ఏర్పాటుచేసి ఐదు రాష్ట్రాల‌లో అన్నార్తుల‌కు ప‌ట్టెడ‌న్నం పెట్టే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం దిద్ది ఆద‌ర్శంగా నిలిచారు. గతంలో కూడా తిరుప‌తి,బెంగ‌ళూరు, హైద్రాబాద్ వంటి మ‌హాన‌గ‌రాల మీదుగా వీరి సేవా కార్య‌క్ర‌మాలు విస్తృతం అయ్యాయి. అయితే కరోనా కార‌ణంగా తిండికి గ‌తి లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న వారిని గుర్తించి, డొనేట్ ఏ మీల్ పేరిట ఓ ప్రొగ్రాంను ప్రారంభించి నిరంత‌రాయంగా త‌మ‌కు తోచిన రీతిలో సేవ చేస్తూ..తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తమ దాతృత్వాన్నీ చాటుకుంటున్నారు.

దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు..133 లొకేష‌న్లు.. 600 రోజులు.. ప్ర‌తిరోజూ డొనేట్ ఏ మీల్ త‌రుఫున ఏ కొద్ది మందికో త‌మ త‌ర‌ఫున అన్నం అందిస్తున్న వైనం ఓ రికార్డు. తార‌క్ ఫ్యాన్స్ సాధించిన ఈ రికార్డు మ‌రో సంచ‌ల‌నం కానుంది. సామాజిక సేవా కార్య‌క్ర‌మా ల్లో ముందుండే తార‌క్ ఫ్యాన్స్ నిర్వ‌హించిన ఈ డొనేట్ ఎ మీల్ కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న వ‌స్తోంది. టీం తార‌క్ సేవా ట్ర‌స్ట్ చేప‌ట్టిన ఈ మ‌హ‌త్ బృహ‌త్ కార్య‌క్ర‌మానికి సంబంధించి మ‌రికొన్ని వివ‌రాలివి.

సాధార‌ణంగా సినిమా హీరోల అభిమానులు కేవ‌లం కొన్ని సంద‌ర్భాల్లో మాత్ర‌మే స్పందించిన దాఖ‌లాలు ఉంటాయి. ఈ మ‌ధ్య సేవా కార్య‌క్ర‌మాల విస్తృతి పెరిగినా, గ‌తంలో ఇంతటి స్థాయిలో ఉండేవి కావు. కొన్ని మాత్రం సైలెంట్ మోడ్ లోనే ఏ ప్ర‌చార కాంక్షా లేకుండా జ‌రిగిన దాఖ‌లాలూ ఉన్నాయి. కానీ తార‌క్ ఫ్యాన్స్ మాత్రం వీలున్నంత వ‌ర‌కూ మంచి కార్య‌క్ర‌మాలు చేయాలన్న త‌లంపులోనే ఉన్నారు.

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న వేళ నుంచి వీళ్లు త‌మ వంతుగా అన్న‌దానం చేస్తూనే ఉన్నారు. ఇందుకు ఒక్కో అభిమాని త‌మ ప‌రిధిలో వీలున్నంత మేర డొనేట్ ఏ మీల్ అనే నినాదం అందుకుని ప‌నిచేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ పిలుపు అందుకున్న తార‌క్ ను అభిమానించే యువ‌త ఆంధ్రా, తెలంగాణ‌లోనే కాకుండా పొరుగున ఉన్న బెంగ‌ళూరు, చెన్నై లాంటి మ‌హా న‌గ‌రాల్లోనూ ఈ సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి ప‌లువురి ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఆంధ్రా, తెలంగాణ అనే కాదు పొరుగున ఉన్న రాష్ట్రాల‌లో కూడా తార‌క్ ఫ్యాన్స్ అంతా క‌లిసి ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. అన్నార్తుల‌ను ఆదుకోవ‌డంలో ఉన్న తృప్తిని మించి మ‌రొక‌టి లేనేలేద‌ని చెబుతున్నారు.