ఎన్టీఆర్ స్క్రిప్టుకు రిపేర్లు?


‘ఆర్ఆర్ఆర్’ మొదలయ్యే సమయానికి రెండేళ్ల లోపే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలన్నది ప్లాన్. కానీ కరోనా, ఇతర కారణాలు తోడై.. సినిమా చాలా ఆలస్యమైంది. జూనియర్ ఎన్టీఆర్ చివరి సినిమా ‘అరవింద సమేత’కు, ‘ఆర్ఆర్ఆర్’కు మధ్య గ్యాప్ మూడున్నరేళ్లు కావడం గమనార్హం. రాజమౌళితో సినిమా అంటే ఆలస్యం మామూలే కానీ.. ఈ చిత్రం మరీ ఇంత లేటవుతుందని ఎవరూ అనుకోలేదు. దీనికి తోడు ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తయ్యాక తారక్ వెంటనే కొత్త చిత్రాన్ని మొదలుపెట్టకపోవడం అభిమానులను నిరాశ పరిచింది.

కొరటాల శివతో సినిమాను ప్రకటించి ఏడాది దాటినా అది ప్రారంభోత్సవం జరుపుకోకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది ఫ్యాన్స్‌లో. ఇదిగో అదిగో అంటున్నారే తప్ప ఆ చిత్రం ముందుకు కదలట్లేదు. ‘ఆచార్య’ రిలీజయ్యాక కొంచెం గ్యాప్ తీసుకుని.. తారక్ సినిమాను కొరటాల మొదలుపెట్టేస్తాడని అనుకున్నారు కానీ.. అలా ఏమీ జరగట్లేదు.

మొన్నటిదాకా అంచనా వేసినట్లు జూన్‌లో తారక్-కొరటాల సినిమా సెట్స్ మీదికి వెళ్లట్లేదు. కొత్త డెడ్ లైన్ జులై ద్వితీయార్ధం అని సమాచారం. ఈ ఆలస్యానికి పరోక్షంగా ‘ఆచార్య’ సినిమానే కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వల్ల భారీగా నష్టపోయిన బయ్యర్లకు సెటిల్ చేసే వ్యవహారంలో కొన్ని రోజులుగా కొరటాల తలమునకలై ఉన్నాడు. అది పూర్తయ్యాక తారక్ స్క్రిప్టు మీద మళ్లీ కూర్చుంటున్నట్లు తెలిసింది.

‘ఆచార్య’కు దారుణమైన ఫలితం దక్కిన నేపథ్యంలో తర్వాతి సినిమాను పకడ్బందీగా తీర్చిదిద్దాల్సిన అవసరముంది. కొరటాల టెన్షన్ పడకుండా తారక్ బాగానే సపోర్ట్ ఇస్తున్నప్పటికీ.. తనకు తానుగా ఈ దర్శకుడు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ‘ఆచార్య’ బయ్యర్లకు కొంత మేర నష్టాల్ని తారక్ సినిమాతోనూ భర్తీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆ చిత్రంతో కచ్చితంగా బ్లాక్‌బస్టర్ కొట్టాల్సిన స్థితిలో ఉన్నాడు కొరటాల. కాబట్టి ఏ రకంగానూ ఛాన్స్ తీసుకోవడానికి లేదు. అందుకే స్క్రిప్టుకు కొన్ని రిపేర్లు చేసి మరింత పకడ్బందీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో కొరటాల ఉన్నట్లు తెలుస్తోంది.