అది ఫ్లాప్.. ఇది హిట్

వేసవిలో రెండు నెలల పాటు ప్రతి భాషలోనూ క్రేజీ సినిమాలు రిలీజవుతుంటాయి. ఈ వారం కూడా అందుకు భిన్నమేమీ కాదు. వివిధ భాషల్లో పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. ఐతే తొలి రోజు ఓపెనింగ్స్ విషయంలో ఈ సినిమాకు ఢోకా లేకపోయింది. మరి డివైడ్ టాక్‌ను తట్టుకుని సినిమా ఏమాత్రం నిలబడుతుందో.. వీకెండ్లో ఎంత వరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి.

ఇక హిందీ, తమిళ భాషల్లోనూ ఈ వీకెండ్లో రెండు క్రేజీ సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఒకటి.. డాన్. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో సిబి చక్రవర్తి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజైంది. ఐతే తెలుగులో ‘సర్కారు వారి పాట’ రిలీజవడంతో ఇక్కడ ‘డాన్’ నామమాత్రంగా విడుదలైంది. తమిళంలో ఈ చిత్రానికి చాలా మంచి టాక్ వినిపిస్తోంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి ‘డాన్’ షోలు మొదలు కాగా.. ఉదయానికి ఫుల్ పాజిటివ్ టాక్ బయటికి వచ్చింది. కామెడీకి తోడు ఎమోషన్లు కూడా బాగా పండటంతో ఈ సినిమా సూపర్ హిట్ అవడం గ్యారెంటీ అంటున్నారు.

ఇక శుక్రవారమే హిందీలో ‘జయేష్ భాయ్ జోర్దార్’ చిత్రం విడుదలైంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో దివ్యాంగ్ ఠక్కర్ రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట సరైన బజ్ కనిపించలేదు. దానికి తగ్గట్లే సినిమా టాక్ కూడా బాగా లేదు. సినిమా చాలా బోరింగ్ అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. రివ్యూలు కూడా పాజిటివ్‌గా లేవు. రణ్వీర్ ఖాతాలో మరో ఫ్లాప్ జమ కావడం గ్యారెంటీ అంటున్నారు.

అతడి చివరి సినిమా ‘83’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టరే అయింది. ‘జయేష్ బాయ్’ ఆ మాత్రం కూడా ఆడే పరిస్థితి కనిపించడం లేదు. ఓపెనింగ్స్ పరంగా తీవ్ర నిరాశకు గురి చేస్తున్న బాలీవుడ్ సినిమాల జాబితాలో ఇది కూడా చేరబోతోంది. తొలి రోజు రూ.5 కోట్ల వసూళ్లు కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.