ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యుత్తమ నటుల్లో ఒకడు కమల్ హాసన్. నటుడిగా ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియాలో ఇంకెవ్వరూ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఐదేళ్ల వయసులోనే తెరంగేట్రం చేసి 60 ఏళ్లకు పైగా నటనలో కొనసాగడం ఆయనకే చెల్లు. ఐతే గత దశాబ్ద కాలంలో కమల్ సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేరు. చేసిన సినిమాలు తక్కువ. అందులో విశ్వరూపం-1 మాత్రమే బాగా ఆడింది. పొలిటికల్ పార్టీ పెట్టాక కమల్ దాదాపు సినిమాలకు దూరమైపోయినట్లే కనిపించారు. ఐతే రాజకీయాల్లో ఎదురు దెబ్బ తిన్నాక కమల్ మళ్లీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అవుతున్నాడు.
ఖైదీ, మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో కమల్ విక్రమ్ అనే ఎగ్జైటింగ్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి మేటి నటులు ఇందులో ప్రత్యేక పాత్రలు పోషించడంతో విక్రమ్‌పై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. జూన్ 3న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్లను మొదలుపెట్టింది చిత్ర బృందం. ముందుగా ఈ చిత్రం నుంచి ఒక పాట రిలీజ్ చేశారు. తమిళంలో పత్తల పత్తల అంటూ సాగే ఈ పాటను స్వయంగా కమలే రాసి, పాడడం విశేషం.
ప్రస్తుతం ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన అనిరుధ్ రవిచందర్ మంచి ఊపున్న ట్యూన్ ఇవ్వగా.. కమల్ తనదైన శైలిలో పాటను రాయడమే కాక.. మంచి ఎనర్జీతో పాడారు. అంతకుమించి ఈ పాటలో కమల్ వేసిన స్టెప్పులు సూపర్ అనే చెప్పాలి. కమల్ ఎంత మంచి డ్యాన్సరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ 70వ పడికి చేరువ అవుతూ.. ఈ పాటలో ఆయన చూపించిన ఎనర్జీ అసామాన్యం అనే చెప్పాలి.
స్టెప్పులు చాలా సరదాగా, లైవ్లీగా సాగడం.. పాట చిత్రీకరణ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈ పాట ఇన్‌స్టంట్ హిట్టయిపోయింది. త్వరలోనే ఈ పాటను తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 15న వివిధ భాషల్లో విక్రమ్ ట్రైలర్ లాంచ్ కానుంది. అది అంచనాలకు తగ్గట్లు ఉంటే సినిమా మీద హైప్ అంకా పెరగడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates