విజ‌య్-వంశీ.. పెద్ద పెద్దోళ్లే


త‌మిళంలో నంబ‌ర్ వ‌న్ స్టార్ అయిన‌ విజ‌య్ ఓ తెలుగు ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తాడ‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఆ చిత్రాన్ని ఓ తెలుగు నిర్మాత ప్రొడ్యూస్ చేయ‌డం కూడా ఆశ్చ‌ర్యం కలిగించే విష‌య‌మే. ఐతే తెలుగులో కొన్నేళ్లుగా నెమ్మ‌దిగా మార్కెట్ పెంచుకుంటున్న విజ‌య్.. మ‌రింత‌గా ఇక్క‌డి మార్కెట్‌ను కొల్ల‌గొట్ట‌డం కోసం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు బేన‌ర్లో ద్విభాషా చిత్రానికి అంగీకారం తెలిపాడు.

ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా క‌థానాయిక‌గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. సంగీత ద‌ర్శ‌కుడిగా త‌మ‌న్ ఖ‌రారయ్యాడు. త్వ‌ర‌లో సెట్స్ మీదికి వెళ్ల‌బోతున్న ఈ చిత్రంలో ఇత‌ర ముఖ్య పాత్ర‌ల‌కు న‌టీన‌టుల ఎంపిక పూర్తయిన‌ట్లే క‌నిపిస్తోంది. మామూలుగా హీరో హీరోయిన్లు కాకుండా ఇత‌ర ముఖ్య తారాగ‌ణం గురించి ప్ర‌త్యేకంగా అప్‌డేట్స్ ఇవ్వ‌డం లాంటిది ఉండ‌దు. కానీ ఈ చిత్రానికి మాత్రం ఆ ప‌ని చేస్తున్నారు.

ప్ర‌స్తుతానికి ద‌ళ‌ప‌తి66గా పిలుచుకుంటున్న ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌ల‌కు పెద్ద పెద్ద ఆర్టిస్టుల‌నే తీసుకున్నారు. ప్ర‌కాష్ రాజ్, శ‌ర‌త్ కుమార్, ప్ర‌భు, జ‌య‌సుధ‌.. ఈ చిత్రంలో న‌టిస్తున్న‌ట్లుగా వేర్వేరుగా అప్‌డేట్స్ ఇచ్చారు. ఈ న‌లుగురూ కూడా అటు త‌మిళంలో, ఇటు తెలుగులో ప్రేక్ష‌కుల‌కు బాగా ప‌రిచ‌యం ఉన్న వాళ్లే. త‌మిళుడైన‌ శ‌ర‌త్ కుమార్ గ్యాంగ్ లీడ‌ర్ మొద‌లుకుని భ‌ర‌త్ అనే నేను వ‌ర‌కు చాలా తెలుగు సినిమాల్లో ప్ర‌త్యేక పాత్ర‌లు పోషించాడు.

ప్ర‌కాష్ రాజ్ సంగ‌తి చెప్పాల్సిన ప‌ని లేదు. రెండు భాష‌ల్లోనూ లెక్క‌లేన‌న్ని సినిమాలు చేశాడు. అటు త‌మిళంలో, ఇటు తెలుగులో ఆయ‌న్ని లోక‌ల్‌గానే ఫీల‌వుతారు. మ‌రో త‌మిళ న‌టుడు ప్ర‌భు సైతం తెలుగులో చాలా సినిమాల్లో న‌టించాడు. జ‌య‌సుధ తెలుగు న‌టే అయినా త‌మిళంలో పాపుల‌రే. వీరిలో ప్ర‌కాష్ రాజ్ లేదా శ‌ర‌త్ కుమార్ విల‌న్ పాత్ర పోషించే అవ‌కాశం ఉంది. విజ‌య్ చివ‌రి చిత్రం బీస్ట్ ఇటీవ‌లే విడుద‌లై ఫ్లాప్ అయింది. దీంతో విజ‌య్‌కు మంచి హిట్ ఇవ్వాల్సిన బాధ్య‌త వంశీపై ప‌డింది.