ప్రతి డైరెక్టర్, ప్రతి నిర్మాత, ప్రతి హీరో కూడా తాము తీసిన సినిమా సూపరో సూపర్ అనే అంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం వాళ్ల మాటలు మొక్కుబడిగా అనిపించవు. వాళ్లది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగానూ అనిపించదు. ‘సర్కారు వారి పాట’ టీం కాన్ఫిడెన్స్ చూసినపుడు ఇండస్ట్రీ జనాలకు కూడా సానుకూల సంకేతాలే కనిపిస్తున్నాయి. ఈ సినిమా స్యూర్ షాట్ బ్లాక్‌బస్టర్ అనే చర్చ ఇండస్ట్రీలో కొన్ని రోజులుగా నడుస్తోంది. యూనిట్ సభ్యులతో పాటు సినిమా రష్ చూసిన వాళ్లంతా సక్సెస్ మీద చాలా నమ్మకంతో ఉన్నారు.
ట్రైలర్, ఇతర ప్రోమోలు చూసిన ప్రేక్షకులకు కూడా సినిమా మీద బాగానే గురి కుదిరింది. కథాకథనాల పరంగా కొత్తగా లేకపోయినా.. ఓ పెద్ద హీరో నటించిన కమర్షియల్ సినిమా నుంచి ఆశించే అంశాలన్నీ ఇందులో ఉంటాయని.. ఆ ఆకర్షణలే సినిమాను నడిపించేస్తాయని, మినిమం గ్యారెంటీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఇదని చిత్ర వర్గాల సమాచారం.
‘సర్కారు వారి పాట’ విషయంలో అందరికంటే ఎక్కువ నమ్మకంగా ఉన్నది దర్శకుడు పరశురామే. ఈ సినిమా సక్సెస్ కావడం అందరి కంటే అతడికే ఎక్కువ అవసరం. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా మహేష్, కీర్తి సురేష్, నిర్మాతల కెరీర్లో పెద్ద మార్పేమీ ఉండదు. కానీ ఇది అంచనాలకు తగ్గట్లు ఆడితే పరశురామ్ వేరే లెవెల్‌కు వెళ్లిపోతాడు. తేడా కొడితే ఇక మళ్లీ అతడికి ఇలాంటి పెద్ద ప్రాజెక్టు రాకపోవచ్చు. తిరిగి మీడియం రేంజ్ సినిమాల్లోకి వెళ్లిపోతాడు.
‘యువత’ లాంటి చిన్న సినిమాతో కెరీర్ ఆరంభించిన పరశురామ్.. మహేష్‌తో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసే స్థాయికి వస్తాడని కొన్నేళ్ల ముందు వరకు ఎవరికీ అంచనాల్లేవు. బహుశా పరశురామ్ కూడా తాను ఈ స్థాయి సినిమా తీస్తానని ఊహించి ఉండడు. ఎందుకంటే ఆరేళ్ల ముందు కూడా పరశురామ్.. అల్లు శిరీష్ లాంటి హీరోతో ‘శ్రీరస్తు శుభమస్తు’ చేశాడు. ఆ తర్వాత అతను తీసిన ‘గీత గోవిందం’ కూడా మొదలయ్యే సమయానికి చిన్న ప్రాజెక్టే. కానీ దానికి అనూహ్యంగా క్రేజ్ వచ్చి, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్నందుకుంది. దీంతో పరశురామ్ కాన్ఫిడెన్స్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అదృష్టం కొద్దీ మహేష్.. వంశీ పైడిపల్లితో చేయాల్సిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడం, అదే సమయంలో పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో ‘సర్కారు వారి పాట’ ఓకే అయింది. మహేష్ నమ్మకాన్ని నిలబెట్టే సినిమానే అతడు తీశాడని ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు. ఆ నమ్మకం నిజమైతే అతను ఒకేసారి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లీగ్‌లోకి వెళ్లిపోతాడనడంలో సందేహం లేదు.