మహేష్ ముందు ఈజీ టార్గెట్టే


ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, సినిమాల బిజినెస్, వసూళ్ల పరంగా చూస్తే టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు మహేష్ బాబు. అతడి సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వంద కోట్ల షేర్ ఈజీ టార్గెట్ అయిపోతోంది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రతి సినిమాకూ మహేష్ మార్కెట్ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఇటు యూత్, అటు ఫ్యామిలీస్‌ను థియేటర్లకు రప్పించే స్టామినా ఉండటమే అందుక్కారణం. ఈ రెండు వర్గాలనూ అలరించే సినిమా చేశాడంటే బాక్సాఫీస్ మోత మోగిపోవాల్సిందే.

‘సర్కారు వారి పాట’ ఆ తరహా సినిమాలాగే కనిపిస్తోంది. రిలీజ్ టైమింగ్ కూడా బాగా కుదరడంతో సినిమాకు మంచి బిజినెస్సే జరిగింది. వరల్డ్ వైడ్ ‘సర్కారు వారి పాట’ థియేట్రికల్ హక్కులు రూ.125 కోట్లు కావడం విశేషం. అన్ని ఏరియాల్లోనూ సినిమాకు మంచి రేట్లు పలికాయి. రెండు తెలుగు రాష్ట్రాల వరకే ఈ చిత్రం రూ.100 కోట్ల దాకా బిజినెస్ చేయడం గమనార్హం.

‘సర్కారు వారి పాట’ నైజం హక్కులు రూ.36 కోట్లు పలకగా.. సీడెడ్లో ఈ చిత్ర హక్కులు రూ.13.5 కోట్లు పలికాయి. వైజాగ్ ఏరియాకు రూ.13 కోట్లకు రైట్స్ తీసుకోగా.. ఆంధ్రాలోని మిగతా ప్రాంతాలన్నీ కలిపి హక్కులు రూ.36 కోట్ల మేర పలికాయి. ఇలా మొత్తంగా ఏపీ, తెలంగాణ బిజినెస్ రూ.100 కోట్లకు చేరువగా వెళ్లింది. కర్ణాటక హక్కులు రూ.8.5 కోట్లకు అమ్ముడవగా.. ఓవర్సీస్ రైట్స్ రూ.11 కోట్లకు ఇచ్చారు. మిగతా ఏరియాల రైట్స్, పబ్లిసిటీ ఖర్చు కలుపుకుంటే ఈ చిత్రం రూ.125 కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ అయినట్లు.

‘ఆచార్య’తో పోలిస్తే రూ.15 కోట్లకు తక్కువగా ఈ సినిమా బిజినెస్ చేసింది. ఆ సినిమా ఫలితం దృష్ట్యా మహేష్ మూవీ బయ్యర్లు కొంత సేఫ్ జోన్లో ఉన్నట్లే. సినిమాకు మంచి బజ్ ఉండటం, బాక్సాఫీస్ దగ్గర అసలు పోటీయే లేకపోవడం ‘సర్కారు వారి పాట’కు కలిసొచ్చే అంశం. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రూ.125 కోట్ల టార్గెట్‌ను అందుకోవడం మహేష్‌కు చాలా ఈజీనే అని చెప్పాలి.