కెజిఎఫ్ 2 హిందీ – 400 కోట్లతో నెంబర్ వన్

కమర్షియల్ సినిమాలు లేక అలో లక్ష్మణా అంటూ గగ్గోలు పెడుతున్న బాలీవుడ్ కు తెలుగు కన్నడ విజువల్ గ్రాండియర్లు కల్పతరువులా మారాయి. ప్రేక్షకులకు వీనులవిందు అందిస్తూ, డిస్ట్రిబ్యూటర్లకు కనక వర్షం కురిపిస్తూ కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి.

తాజాగా కెజిఎఫ్ 2 హిందీ వెర్షన్ సగర్వంగా 400 కోట్ల క్లబ్ లో అధికారికంగా అడుగు పెట్టింది. ఇప్పటిదాకా ఏ మూవీకీ సాధ్యం కాని ఫీట్ ని కేవలం మూడో వారంలోనే సాధించి అబ్బురపరిచింది. ఫైనల్ రన్ పూర్తి కాలేదు కాబట్టి క్లోజింగ్ ఫిగర్స్ ఇంకా షాక్ ఇవ్వొచ్చు.

ఇది ఒక కన్నడ మూవీకి దక్కిన అరుదైన గౌరవం. ఇప్పటిదాకా రాజ్ కుమార్, రవిచంద్రన్, అనంత్ నాగ్ లాంటి దిగ్గజాల వల్ల కానిది యష్ అతి తక్కువ సమయంలో అందుకోవడం పట్ల ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు.

రంజాన్ మాసం అయ్యాక కలెక్షన్లు మళ్ళీ పుంజుకోవడం ట్రేడ్ కి జోష్ ఇచ్చింది. దానికి తోడు రన్ వే 34, హీరోపంటి 2లను అక్కడి ఆడియన్స్ అంతగా ఆదరించలేదు. దీంతో కెజిఎఫ్ 2కే జనం క్యూ కట్టారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్, దంగల్ లను దాటేయడం మాత్రం అంత ఈజీగా చెరిగేది కాదు.

పైరసీ కాలంలో డబ్బింగ్ సినిమాలకు థియేట్రికల్ రెస్పాన్స్ తక్కువగా ఉండే నార్త్ లో ఈ స్థాయి ఊచకోత ఊహించనిది. దెబ్బకు యష్ నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్టు చేయాలో తెలియని ఒత్తిడిలో పడిపోయాడు. కెజిఎఫ్ చాఫ్టర్ 3కి డిమాండ్ ఉంది కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ ఎలాంటి క్లూస్ ఇవ్వడం లేదు. అమీర్ ఖాన్ దంగల్ ఇప్పటిదాకా 387 కోట్లతో నెంబర్ వన్ ప్లేస్ లో ఉండగా రాఖీ భాయ్ దాన్ని దూదిపింజె ఊదినంత ఈజీగా లేపేశాడు. ఇంకా హిస్టరీ కొనసాగుతోంది. చూద్దాం