జనగణమన.. ఈ పేరుతో సినిమా గురించి ఎప్పట్నుంచో చర్చ నడుస్తోంది. పూరి జగన్నాథ్ తప్పక చేయాలని కోరుకుంటున్న సినిమా ఇది. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పొచ్చు. ఈ సినిమా నుంచి ఓ పవర్ ఫుల్ డైలాగ్‌ను కూడా పూరి ఇంతకుముందు బయటపెట్టాడు. మహేష్ బాబుతో ఈ సినిమా చేయాలన్నది పూరి కోరిక.
ఇంతకుముందు అతడితో ‘పోకిరి’ లాంటి ఇండస్ట్రీ హిట్, ‘బిజినెస్‌మేన్’ లాంటి పవర్ ఫుల్ మూవీ తీశాడు పూరి. ఐతే ‘జనగణమన’ చేద్దాం అనుకునే సమయానికి పూరి ఫామ్ కోల్పోయాడు. ఆయనపై మహేష్‌కు గురి కుదరలేదు. ఈ సినిమా చేయడానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంపై పూరి హర్టయినట్లు కూడా కనిపించాడు. మహేష్ గురించి నెగెటివ్ కామెంట్లు కూడా చేశాడు.
ఐతే ఇటీవల మహేష్ తన అభిమానులతో చిట్‌చాట్ చేస్తూ.. పూరితో సినిమా చేయడానికి అభ్యంతరం లేదని, ఆయన స్క్రిప్టు చెబుతాడని ఎదురు చూస్తున్నానని అన్నాడు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు అనుకోకుండా ‘జనగణమన’ గురించి పూరి మాట్లాడాడు. అది తన డ్రీమ్ ప్రాజెక్టు అని.. తప్పకుండా ఆ సినిమా తీస్తానని ప్రకటించాడు. ఐతే ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరు అనే ప్రశ్న అందరిలోనూ ఉదయించింది. ‘జనగణమన’ చేస్తానన్న పూరి అది మహేష్‌తో అని మాత్రం చెప్పలేదు.
పూరి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఇంతకుముందు మహేష్‌కు ఈ కథ చెప్పడం, అతను ఈ సినిమా చేయడానికి అంత ఆసక్తి చూపించకపోవడం.. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య అంతరం రావడం జరిగింది. మరో కథ చెప్పి మెప్పిస్తే పూరితో సినిమా చేద్దామని మహేష్ అనుకుంటూ ఉండొచ్చు. పూరి మాత్రం ‘జనగణమన’ దగ్గరే ఆగిపోయినట్లున్నాడు.
మరి ఇప్పుడు ఆ కథకే మరింత మెరుగులు దిద్ది మహేష్‌ను ఒప్పించి సినిమా చేస్తాడా.. లేక అతడికి నచ్చని స్క్రిప్టును పట్టుకెళ్లి మరో హీరోతో తాను అనుకున్నట్లే ‘జనగణమన’ను తెరకెక్కిస్తాడా అన్నది చూడాలి. ఏదేమైనా ఇంకో ఏడాదిలోపు ‘జనగణమన’ పట్టాలెక్కే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates