మహానటి మూవీతో తనపై భారీగా అంచనాలు పెంచిన నటి కీర్తి సురేష్. ఆ సినిమా ముందు వరకు ఆమెను ఓ సగటు హీరోయిన్ లాగా చూశారే తప్ప ఒక నటిగా గుర్తించలేదు. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన సినిమాలో లీడ్ రోల్‌కు కీర్తిని తీసుకోవడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఐతే తన ప్రతిభను ప్రశ్నించిన అందరికీ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది ఈ మలయాళ భామ. ‘మహానటి’లో ఆమె నటనకు జనం ఫిదా అయిపోయారు. నేషనల్ అవార్డ్స్ జ్యూరీ సైతం ఆమె నటనకు మెచ్చి జాతీయ అవార్డు కట్టబెట్టింది.
ఐతే ఈ సినిమాతో వచ్చిన పేరుతో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఒప్పుకుని చకచకా చేసేసింది కీర్తి. కానీ పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి.. వీటిలో ఒక్కటీ కనీస స్థాయిలో కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక స్టార్ హీరోల సరసన చేసిన కమర్షియల్ సినిమాలు సైతం తుస్సుమనిపించాయి. ఇటు సినిమాలూ మెప్పించక.. కీర్తి పాత్రలూ పండక ఆమె కెరీర్ తిరోగమనంలో పయనించింది.
కీర్తి మీద ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్న ప్రేక్షకులకు ప్రతిసారీ నిరాశ తప్పలేదు. ఆమె మీద పూర్తిగా ఆశలు కోల్పోతున్న దశలో ఇప్పుడు చిన్ని (తమిళంలో సాని కాయిదం) సినిమా అమేజాన్ ద్వారా రిలీజైంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లు చూసి జనాలు షాకైపోయారు. కీర్తి ఇలాంటి పాత్రలోనా అని. ఇప్పుడు సినిమా చూసి ఇంకా షాకవుతున్నారు. తనకు జరిగిన ఘోర అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే పాత్రలో కీర్తి పాత్ర.. ఆమె నటన అద్భుతం అనే చెప్పాలి. అత్యంత కిరాతకంగా హత్యలు చేసే సన్నివేశాల్లో కీర్తి పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే ఎమోషనల్ సీన్లలో ఆమె కన్నీళ్లు పెట్టించేసింది.
మొత్తంగా తన పాత్రను పరిశీలిస్తే ఇండియన్ సినిమాలో మరే స్టార్ హీరోయిన్ కూడా ఇలాంటి పాత్ర చేయలేదు అని ఘంటాపథంగా చెప్పేయొచ్చు. ఇలాంటి పాత్రను ఒప్పుకున్నందుకు కీర్తిని ఎంత పొగిడినా తక్కువే. సినిమా కూడా గ్రిప్పింగ్‌గా ఉండటం, కీర్తి పాత్ర భలేగా పేలడంతో ‘చిన్ని’ తన కెరీర్లో ఒక మైలురాయిలా నిలవడం ఖాయం అనే చెప్పాలి.